Vijaya Sai Reddy Appeal On Raghurama Krishna Raju To Modi - Sakshi
Sakshi News home page

కోటి అందింది.. రాజా ఇంకా పది కోట్లివ్వాలి!

Published Tue, Jul 27 2021 4:39 AM | Last Updated on Tue, Jul 27 2021 6:01 PM

Vijaya Sai Reddy Appeal On Raghurama Krishna Raju To Modi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ కె.రఘురామకృష్ణరాజు, టీవీ 5 చానల్‌ ఛైర్మన్‌ బి.ఆర్‌ నాయుడు మధ్య ఒక మిలియన్‌ యూరో హవాలా లావాదేవీలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో పీఎంఎల్‌ఏ, ఫెమా ఉల్లంఘనలు జరిగాయని ఆధారాలతో సహా ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. తనకు ఇప్పటి వరకు ఒక్కటి (కోటి రూపాయలు) మాత్రమే ఇవ్వగా ఇంకా పది (పది కోట్ల రూపాయలు) చెల్లించాల్సి ఉందంటూ రఘురామకృష్ణరాజు చాటింగ్‌లో బిఆర్‌ నాయుడుతో పేర్కొనటం ఫిర్యాదుతో జత చేసిన ఆధారాల పేజీ నెం:4లో వివరంగా ఉంది. పార్టీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి సహా 15 మంది ఎంపీల సంతకాలతో కూడిన ఫిర్యాదు లేఖ ప్రతిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీల బృందం సోమవారం సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేసింది. లేఖలో వివరాలు ఇలా ఉన్నాయి. 

శాస్త్రీయంగా నిర్థారణ..
‘‘ఎంపీ రఘురామకృష్ణరాజు, బి.ఆర్‌. నాయుడు మధ్య చట్టాలను ఉల్లంఘిస్తూ జరిగిన అక్రమ లావాదేవీ, మనీ లాండరింగ్‌పై ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. మనీలాండరింగ్, ఫారిన్‌ ఎక్సే్ఛంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ 1999లోని పలు నిబంధనల ఉల్లంఘనలను ప్రాథమికంగా రుజువు చేసే సాక్ష్యాధారాలను కనుగొన్నారు. దర్యాప్తులో భాగంగా ఏపీ సీఐడీ పోలీసులు కేసులో ప్రధాన నిందితుడి ఫోన్‌ను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లో శాస్త్రీయంగా విశ్లేషించినప్పుడు పది లక్షల యూరోల అక్రమ హవాలా వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌) అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఇచ్చిన నివేదికను కూడా ఈ ఫిర్యాదుతో జతపర్చాం. 

‘అంగడియా’ .... 
క్రిమినల్‌ కేస్‌ నెంబర్‌ 12/2021 విచారణ సందర్భంగా ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లో నిందితుల వస్తువులను విశ్లేషించి ఒక మిలియన్‌ యూరోల మేరకు హవాలా లావాదేవీ జరిగినట్లు ఏపీ సీఐడీ పోలీసులు గుర్తించారు. హవాలా లావాదేవీకి రుజువుగా ‘అంగడియా’ అనే ప్రస్తావన రఘురామకృష్ణరాజు, బి.ఆర్‌.నాయుడు మధ్య సాగిన సంక్షిప్త సందేశాల సంభాషణలో ఉంది. ఓసీబీసీ ఖాతా నుంచి ఒక మిలియన్‌ యూరోలు వెల్స్‌ ఫార్గో ఖాతాకు బదిలీ అయినట్టు ఈ సంభాషణ తేటతెల్లం చేస్తోంది. ఇది మనీ లాండరింగ్‌ను రుజువు చేస్తోంది. లావాదేవీ ‘3’ అని చేసిన ప్రస్తావన హవాలా కింద ఇచ్చిన కోట్ల రూపాయల గురించి వెల్లడిస్తుండగా మిగిలినవి ఒక రోజు అనంతరం ఇస్తానని ఇచ్చిన హామీగా గుర్తించవచ్చు. ఒకటో నెంబరు నిందితుడిగా ఉన్న రఘురామకృష్ణరాజుకు రెండో నెంబరు నిందితుడిగా ఉన్న బి.ఆర్‌.నాయుడు మొత్తం రూ.11 కోట్ల మేర లావాదేవీల్లో రూ.కోటి చెల్లించినట్లు పేజీ నెంబరు 4లో ఉంది. ఈ వ్యవహారాన్ని పేజీ నెంబరు 5లో పేర్కొన్న మిలియన్‌ యూరో బదిలీ ప్రస్తావనలోనూ గమనించవచ్చు.

విదేశాలకు పరారీ కాకుండా నిరోధించండి..
నిందితులైన కె.రఘురామకృష్ణరాజు, బి.ఆర్‌.నాయుడులపై పీఎంఎల్‌ఏ, ఫెమా చట్టాల కింద  కేసు నమోదు చేసి సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రధానిని విజయసాయిరెడ్డి కోరారు. నిందితులు విదేశాలకు పారిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని, కస్టడీలోకి తీసుకుని అనుమానాస్పద లావాదేవీలను వెలికి తీసేలా ఆదేశించాలన్నారు.

సీఐడీ రాసిన లేఖను జతపరిచిన ఎంపీలు..
ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్‌కు సంబంధించి అనుమానాస్పద లావాదేవీలను వివరిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు సీఐడీ రాసిన లేఖను, సంభాషణలను ప్రధానికి పంపిన ఫిర్యాదులో విజయసాయిరెడ్డి జోడించారు. ప్రధాన నిందితుడు ఎంపీ రఘురామకృష్ణరాజుకి సంబంధించి సీజైన మొబైల్‌ ఫోన్‌ను ఏపీఎఫ్‌ఎస్‌ఎల్‌కు ఫోరెన్సిక్‌ విశ్లేషణ కోసం పంపామని, దాని నివేదిక అందిందని సీఐడీ తన లేఖలో పేర్కొంది. రఘురామకృష్ణరాజు(ఏ1), టీవీ 5 ఛైర్మన్‌(ఏ2)కు మధ్య జరిగిన లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని, ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌ జరిగిందనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని వివరించింది. 

ఇవిగో ఖాతా నంబర్లు...
వెల్స్‌ ఫార్గో ఖాతా నెం: 51700263205 నుంచి పది లక్షల యూరోలను ఓసీబీసీ ఖాతా నెం: 501189518301కు బదిలీ చేసినట్లు ఆ ఫోన్‌ ఛాటింగ్‌ తేటతెల్లం చేసింది. ఇది పీఎంఎల్‌ఏ నిబంధనల ఉల్లంఘనను రుజువుగా నిలుస్తోంది. ఇద్దరు నిందితుల మధ్య జరిగిన కోట్ల రూపాయల మోసపూరిత హవాలా లావాదేవీలకు సంబంధించి ఈ ఫిర్యాదు పత్రంతో జత చేసిన ఆధారాల పేజీ నెంబర్లు 2, 3 లో ఛాటింగ్‌ వివరాలు ఉన్నాయి’’ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement