భూ కుంభకోణంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం
♦ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ జరిపించాలి
♦ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో వెలుగుచూసిన భూ కుంభకోణం, రికార్డుల గల్లంతులో మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హస్తం ఉన్నందున సీబీఐ విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే దీనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. విశాఖలో భూదందాలపై గురువారమిక్కడ వైఎస్సార్‌సీపీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఈ భూ కుంభకోణం విశాఖలోని పలు నియోజకవర్గాల్లో విస్తరించి ఉందని చెప్పారు.
తొలుత లక్ష ఎకరాలకు చెందిన రికార్డులు గల్లంతయ్యాయని, ఐదు వేల ఎకరాలకు సంబంధించిన భూ రికార్డులు ట్యాంపరింగ్‌కు గురయ్యాయని కలెక్టర్ చెప్పారని, కానీ మంత్రి లోకేశ్ వచ్చిన తర్వాత సీన్ మొత్తం మారిందన్నారు. చివరకు 244 ఎకరాలకు సంబంధించి మాత్రమే అవకతవకలు జరిగాయంటూ కలెక్టర్ చెప్పడం చూస్తుంటే రాజకీయ ఒత్తిళ్లు ఎంతగా పనిచేశాయో అర్థమవుతోందన్నారు.
జిల్లా అధికారులు, రాష్ట్ర మంత్రుల సమక్షంలో జరిగే విచారణతో బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఏ ఒక్కరికి లేదన్నారు. ఈ కేసును సీబీఐకు అప్పగించేంత వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటం చేయాలని విజయసాయిరెడ్డి పిలుపు నిచ్చారు. భూ కబ్జాలపై సత్వర న్యాయం జరిగేలా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. కబ్జాదారులకు కఠిన శిక్షలు పడేలా చట్టాలను సవరించాలని విజ్ఞప్తి చేశారు.
భూ కబ్జాలపై న్యాయస్థానాలకు..: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో భూముల రికార్డులు గల్లంతయ్యాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ట్యాంపరింగ్, భూకబ్జాలపై న్యాయస్థానాలకు వెళ్లాల్సిన అవసరముందన్నారు. సీపీఎం నేత సీహెచ్ నరసింగరావు మాట్లాడుతూ భూ కబ్జాలకు పాల్పడేందుకే పట్టాదార్ పాస్ పుస్తకాలు రద్దు చేశారని ఆరోపించారు.