
ఎమ్మెల్యే అనితది మొసలి కన్నీరు
ఎమ్మెల్యే అనితది మొసలి కన్నీరు
వైఎస్సార్ సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బాబూరావు
పాయకరావుపేట: పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత మంత్రి కావాలనే ఉద్దేశ్యంతో తన కుటుంబ సమస్యను దళితుల సమస్యగా అసెంబ్లీలో లేవనెత్తుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు ఆరోపించారు. పాయకరావుపేటలో ఆయన విలేకరులతో బుధవారం మాట్లాడుతూ అనిత తన కుటుంబ సమస్యను దళితుల సమస్యగా చూపించి మొసలి కన్నీరు పెట్టడం సమంజసం కాదన్నారు. ఆమె నియోజకవర్గ ప్రజల కోసం కన్నీరు కారిస్తే ప్రజలు హర్షిస్తారని హితవు పలికారు. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాల్సింది పోయి నా కుటుంబానికి ,నా పిల్లలకు ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించడాన్ని తప్పుపట్టారు. నగిరి ఎమ్మెల్యే రోజా ఆమెను అవమానపర్చినట్టు ఎక్కడా ఆధారాలు లేవని చెప్పారు.
అసెంబ్లీ లాబీలో మాట్లాడిన మాటలను అనిత అన్వయించుకుని సమస్య లేవదీయడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసి, రావెల కిశోర్ మంత్రి పదవిని కాజేసేందుకు ఆమె వేసిన ఎత్తున అని విమర్శించారు. అసెంబ్లీ జరుగుతున్న సభ తీరు చూస్తే కౌరవులు, పాండవుల మధ్య యుద్ధంలా ఉందని, అంతిమ విజయం వైఎస్సార్ సీపీదేనని గుర్తుంచుకోవాలన్నారు. ఆయన వెంట నాయకులు ధనిశెట్టి కృష్ణ, బి.వి.రమణ తదితరులు ఉన్నారు.