గంటా.. వియ్యంకుడికి భయపడుతున్నారా?: రోజా
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో మహిళా వ్యతిరేక పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. మహిళలపై దాడులు, ఆత్మహత్యలు కొనసాగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు. సోమవారం పార్టీ కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ నేరస్తులకు అండగా నిలుస్తోందని ధ్వజమెత్తారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మరణానికి కారణమైన ప్రిన్సిపాల్ బాబూరావును ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె డిమాండ్ చేశారు. బాలసుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించి తక్షణమే బాబూరావుపై విచారణకు ఆదేశించాలన్నారు.
రిషితేశ్వరి మృతిపై బాలసుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన నివేదినకు ఆంధ్రప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టిందని రోజా ప్రశ్నించారు. నిజాలు బయటపడతాయని ప్రభుత్వం భయపడుతుందన్నారు. తమకు న్యాయం జరగలేదనే రిషితేశ్వరి తండ్రి... తన కుమార్తె మృతిపై సీబీఐతో విచారణ చేయించాలంటున్నారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరోవైపు నారాయణ కాలేజీల్లో 11మంది విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరపాలన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు...తన వియ్యంకుడు నారాయణకు భయపడే ఆ కళాశాలపై చర్యలు తీసుకోవటానికి వెనకాడుతున్నారన్నారు. నారాయణ కాలేజీల్లో జరుగుతున్న ఆత్మహత్యలపై విచారణ జరిపించి, తప్పులు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని, నారాయణ కాలేజీల గుర్తింపు రద్దు చేయాలన్నారు. రాష్ట్రంలో మహిళలు అంతా ఏకమై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను నిలదీసి పోరాడాలని రోజా పిలుపు నిచ్చారు.