ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. జెడ్పీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోగా, మెజార్టీ ఎంపీపీ స్థానాల్లో పాగా వేసింది. మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభ సమయంలో ఒకింత ఉత్కంఠ నెలకొంది. లెక్కింపు ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ ఫలితాలు వెలువడడంతో వైఎస్‌ఆర్ సీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. తొలుత కొండపి, కందుకూరు నియోజకవర్గాల్లోని ఎంపీటీసీ ఫలితాలు టీడీపీకి అనుకూలంగా రావడంతో ఆ పార్టీ నేతలు పురపాలక ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతున్నాయని బాకాఊదారు.
ఆ తరువాత జిల్లా వ్యాప్తంగా వస్తున్న ఫలితాలు వైఎస్‌ఆర్ సీపీవైపు ఉండడంతో టీడీపీ శ్రేణుల్లో కొంత నైరాశ్యం నెలకొంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి జెడ్పీటీసీ అభ్యర్థుల విజయాలు ప్రకటించడం మొదలైనప్పటి నుంచి ఫలితాలు వైఎస్‌ఆర్ సీపీకి అనుకూలంగా వస్తుండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ మొదలైంది. ఎంపీటీసీల ఫలితాలు తొలుత రెండు వైఎస్‌ఆర్, టీడీపీ అభ్యర్థులు నువ్వా, నేనా అన్నట్లుగా ఉండడంతో మారుమూల గ్రామాల్లో సైతం ఉత్కంఠకు దారి తీసింది. ఆ తరువాత ఎంపీటీసీ స్థానాలను వైఎస్‌ఆర్ సీపీ సాధించడంతో ఆందోళనకు తెరపడింది. 30కి పైగా మండలాలను దక్కించుకుంది.
బాలాజీ గెలుపుతో...
వైఎస్‌ఆర్ సీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి, జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టరు నూకసాని బాలాజీ పుల్లలచెరువులో విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెల్లుబికింది. జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అవసరమైన స్థానాలు వైఎస్‌ఆర్ సీపీ గెలుచుకోవడంతో నేతలు, కార్యకర్తల్లో ఆనందం కట్టలు తెంచుకుంది. మున్సిపోల్స్‌కు భిన్నంగా ఫలితాలను చూసిన టీడీపీ శ్రేణులకు సార్వత్రిక ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందోననే అలజడి మొదలైంది.
సార్వత్రిక ఎన్నికల్లో మరింత జోష్
గ్రామీణ ఓటర్లు పరిషత్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ వైపు మొగ్గుచూపారు. ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైఎస్ షర్మిల సుడిగాలి పర్యటన, ఆ తరువాత పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో పర్యటన పార్టీ శ్రేణుల్లో కొండంత ఉత్సాహాన్ని నింపాయి. బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి కొన్ని సామాజిక వర్గాలు దూరమయ్యాయని, ఆ వర్గాలన్నీ వైఎస్‌ఆర్ సీపీకి అండగా నిలిచాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
తొలుత ఉత్కంఠ.. ఆపై ఉత్సాహం
Published Wed, May 14 2014 3:50 AM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
Advertisement