
విజయవాడలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం
పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి వెల్లడి
గుంటూరు: విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి తెలిపారు. కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు అందుబాటులో ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పార్టీ త్రిసభ్య కమిటీ రాష్ట్ర పర్యటనలో భాగంగా గుంటూరు వైన్ డీలర్స్ అసోసియేషన్ హాలులో ఆదివారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ అన్ని స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి పార్టీకి కొత్త జవసత్వాలు తీసుకువస్తామని.. ప్రతి సామాజిక వర్గానికీ పార్టీ అనుబంధ విభాగాల్లో స్థానం కల్పిస్తామని వివరించారు. పార్టీకి సంబంధించిన అన్ని విషయాలను కార్యకర్తలు, నేతలు, అభిమానులకు వివరించేందుకు అనువుగా త్వరలో ఒక మాసపత్రికను, నెట్ టీవీని తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ నెట్‌వర్క్ ద్వారా పార్టీ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.