రాజధాని అంటే పిచ్చిమొక్కలేనా?
సాక్షి, అమరావతి బ్యూరో : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అంగరంగ వైభవంగా రాజధానికి శంకుస్థాపన చేయించినా.. అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క పునాదిరాయి ఎందుకు వేయలేకపోయిందని వైఎస్సార్‌సీపీ శాసనసభ పక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాజధాని నిర్మాణ డిజైన్ల రూపకల్పనకు విదేశీ కంపెనీలకు రూ. కోట్లు వెచ్చించి వృథా చేశారని, ప్రపంచస్థాయిలో నిపుణులుగా గుర్తింపు ఉన్న మన ఇంజనీర్లను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరించడం శోచనీయమని ఆయన అన్నారు. స్విస్ ఛాలెంజ్ పేరిట వేలాది కోట్ల రూపాయల దోపిడీకి తెరతీసిన చంద్రబాబు చివరకు సుప్రీం కోర్టు మొట్టికాయలు వేయడంతో ఏకంగా చట్టాలనే మార్చేందుకు సిద్ధపడ్డారని ఆరోపించారు. ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ పద్ధతిని అవలంబిస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
పిచ్చి మొక్కలతో ఉద్యానవనంలా...
‘నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమవరాతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ మట్టీ, నీరూ అందించాలంటూ ఎంతో ఆర్భాటంగా శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఏడాది గడిచినా అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఆ ప్రాంతమంతా పిచ్చి మొక్కలతో ఉద్యానవనంలా వెలిగిపోతోంది’ అని రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. సీడ్ క్యాపిటల్ కింద సింగపూర్ కంపెనీకి 1690 ఎకరాల విలువైన భూములను ఎందుకు అప్పగించనున్నారన్న విషయాన్ని గోప్యంగా ఉంచడంలో ప్రభుత్వ ఆంతర్యమేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని చుట్టు పక్కల టీడీపీ నేతలు కొనుగోలు చేసిన భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనువుగా ఉండేలా ప్రభుత్వం పావులు కదుపుతోందన్నారు. తాత్కాలిక రాజధాని పేరిట రూ. కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారన్నారు.
అబ్డుల్ కలాంకు ఘన నివాళులు
ప్రసిద్ధ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్డుల్ కలాం సేవలను కొనియాడుతూ ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. కలాం చిత్రపటానికి పెద్దిరెడ్డి, పార్థసారధి,ఉదయబాను పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
హైదరాబాద్ నుంచి చంద్రబాబు పలాయనం అందుకే
ఓట్లకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబునాయుడు ఆ కేసులో ఎక్కడ ఆరెస్టు చేస్తారోననే భయంతోనే 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదిలి విజయవాడకు పారిపోయి వచ్చారని పెద్దిరెడ్డి ఆరోపించారు. బాబు అవినీతి బాగోతాన్ని ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తుంటే.. వాటి నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్ని తన మంత్రులతో జగన్‌పై దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లకు నోట్ల విధానాన్ని కనిపెట్టిందే బాబు అని.. అందుకు ఇటీవల ఆ పార్టీ కేటాయించిన రాజ్యసభ సీట్లే ఉదాహరణ అన్నారు.
ఎలాంటి సేవలు చేయనప్పటికీ కేవలం డబ్బులే ప్రమాణికంగా టీజీ వెంకటేష్, చౌదరి లాంటి వారికి రాజసభ సీట్లు ఇచ్చారని ఆరోపించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనే శక్తి లేకనే వాటిని వాయిదా వేయించడానికి ప్రణాళికలు రచిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కార్పొరేటర్లు కర్నాటి రాంబాబు, షేక్ జాన్‌బీ, సిటీ యువజన, విద్యార్థి విభాగం పార్టీ అధ్యక్షులు అంజిరెడ్డి, షేక్ గౌస్ మహమ్మదుద్దీన్, పార్టీ నాయకులు తుమ్ముల చంద్రశేఖర్ (బుడ్డి) పాల్గొన్నారు.