‘వైఎస్సార్‌సీపీకి ప్రజలే కొండంత అండ’
Published Sat, Mar 4 2017 9:25 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
ఉదయగిరి: అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే టీడీపీ ప్రభుత్వ పాలనపై ప్రజాప్రతినిధులు విసుగుచెందారని, వారు వైఎస్సార్‌సీపీ వైపు ఆకర్షితులవుతున్నారని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉదయగిరిలోని మేకపాటి క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన పార్టీ ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే అనేకమంది ఎంపీటీసీలు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు ముందుకొస్తున్నారన్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీలను బెదిరించి, ప్రలోభపెట్టి టీడీపీలోకి చేర్చుకున్నారు. వారికి అక్కడ తగిన న్యాయం జరగక, గుర్తింపు దక్కక తిరిగి సొంతగూటికి చేరుకుంటున్నారన్నారు. ఎన్నికలు దగ్గరపడేకొద్ది జిల్లాలో చాలామంది వైఎస్సార్‌సీపీలోకి రావడం తథ్యమన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డిని గెలిపించేందుకు ప్రతిఒక్కరూ తమవంతు కృషిచేయాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్‌లో ఎన్నో ఏళ్లు పనిచేసినప్పటికీ తగిన గుర్తింపు లభించలేదన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తనను దగ్గరకు తీసుకుని పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారన్నారు. చాలా ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ పాలనలో ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు కూడా విసుగు చెందారన్నారు. కేవలం అబద్ధాలు, అధికారబలం ఉపయోగించి ఏదో చేయాలని టీడీపీ వారు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజలముందు ఇవేమీ సాగవని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ప్రజలు అండగా నిలుస్తారన్నారు. అంతకుముందు ఉదయగిరి బిట్–1 ఎంపీటీసీ ముర్తుజా హుస్సేన్‌ను టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి ఎంపీ రాజమోహన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
Advertisement