ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పులివెందులలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.
పులివెందుల(వైఎస్సార్ జిల్లా) : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మంగళవారం పలు జిల్లాల్లో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ అగ్రనేత వైఎస్ వివేకానంద రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఆందోళనలు, ర్యాలీలు కొనసాగుతాయని ఈ సందర్భంగా వారు తెలిపారు.
అలాగే విజయనగరం జిల్లా పార్వతీపురం మండల కేంద్రంలోని బెలగాం నుంచి వైఎస్సార్ విగ్రహం మీదుగా పాతబస్టాండ్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ పార్వతీపురం సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది.
అదేవిధంగా విశాఖ జిల్లా అచ్యుతాపురంలో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అచ్యుతాపురం కూడలి నుంచి వైఎస్సార్‌సీపీ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు.
చిత్తూరు జిల్లా మదనపల్లిలో పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సమీమ్ అస్లాత్ ఆధ్వర్యంలో ముంబై-చైన్నై రహదారిపై కొవ్వొత్తులతో ర్యాలీ, రాస్తారోకో, ధర్నా నిర్వహించారు.
అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేత కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రాయదుర్గంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది.
ప్రకాశం జిల్లాలో ఎడం బాలాజీ ఆధ్వర్యంలో చీరాలలో కొవ్వొత్తుల ర్యాలీ జరుగగా, ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో సంతనూతలపాడులో ర్యాలీ జరిగింది.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీలు నిర్వహించారు. పార్టీ జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు వివిధ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు.
తణుకులో అర్ధనగ్న ప్రదర్శన చేసి అనంతరం కళ్ళకు గంతలు కట్టుకుని మోకాళ్లపై నిలబడి సర్కారు తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఆచంట నియోజకవర్గంలో పార్టీ కన్వీనర్ ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో వేలాది మందితో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.