
‘చంద్రబాబు ఛాంబర్ బుల్లెట్, లాంచర్ ప్రూఫ్’
గుంటూరు: ఏపీ అసెంబ్లీలో లీకేజీలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. రాజధానిలోని అన్ని నిర్మాణాలను సీబీఐ విచారణలో చేర్చాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఛాంబర్ బుల్లెట్ ప్రూఫ్.. లాంచర్ ప్రూఫ్ అని చెప్పి.. ప్రతిపక్ష నేత ఛాంబర్ మాత్రం వాటర్ ప్రూఫ్ కూడా లేకుండా చేశారని ధ్వజమెత్తారు. తేలికపాటి వర్షానికే ప్రతిపక్ష నేత ఛాంబర్ జలమయమైందని, సచివాలయంలో కూడా అదే పరిస్థితి ఉందని విమర్శించారు.
లీకేజీపై వైఎస్‌ఆర్‌సీపీ కుట్ర చేసిందంటూ నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఫల్యాలను ఎత్తిచూపిన ప్రతిసారి అలానే చేస్తున్నారని, తుని ఘటన, అరటితోట దహన సమయంలోనూ అలానే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఆఘటనలకు సంబంధించి ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదని, వైఎస్ జగన్‌పై నెపం నెట్టి అవినీతి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. అసెంబ్లీ, సచివాలయంలో కారింది నీళ్లు కాదని, టీడీపీ అవినీతి అని దుయ్యబట్టారు.