
‘చంద్రబాబు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు’
నంద్యాల ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డదారులు తొక్కుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డదారులు తొక్కుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. నంద్యాలలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ...‘ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ లొంగనివారిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఆర్కే నగర్ తరహాలో చంద్రబాబు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రలోభాలపై అన్ని సంస్థలు దృష్టి సారించాలి. నంద్యాల ఉప ఎన్నికను నిష్పక్షపాతంగా జరిపించేందుకు చర్యలు తీసుకోవాలి.
టీడీపీకి ఓట్లేయకపోతే నా పెన్షన్ తీసుకోవద్దని, రోడ్లపై నడవవద్దని, చంద్రబాబు నంద్యాల ప్రజలను బెదిరిస్తున్నారు. కేశవరెడ్డి రూ.800 కోట్ల అక్రమాలకు పాల్పడ్డా..మంత్రి ఆదినారాయణరెడ్డి వియ్యంకుడు కావడంతో చర్యలు తీసుకోలేదు. కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేయాలి. మూడేళ్లలో మైనార్టీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదే.
అమ్మనాన్నలు లేని పిల్లలపై పోటీయా అని అంటున్నారు. భూమా నాగిరెడ్డి మరణానికి చంద్రబాబే కారణం. భూమా ఎమ్మెల్యేగా గెలిచింది వైఎస్‌ఆర్ సీపీ నుంచే. పదవి ఇస్తామంటూ ప్రలోభపెట్టి భూమాను చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు సిగ్గు లేకుండా గతం మరిచి మాట్లాడుతున్నారు’. అన్నారు.