భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శ
- జగన్ వ్యక్తిత్వంపై విషప్రచారం
- అవినీతి డబ్బు తీసుకుని అసత్య ప్రచారాలు..
- బీజేపీతో అంటకాగుతున్నట్లు దుష్ప్రచారం
- నిజానికి కాకినాడలో కలసి ఉంది టీడీపీయే
- నంద్యాలలో ముస్లిం ఓట్ల కోసమే నాటకాలు
సాక్షి ప్రతినిధి, నంద్యాల: ‘కుట్రలు చేసేందుకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మళ్లీ ఒక్కటవుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ అభ్యర్థికి చంద్రబాబు రూ. 10 కోట్లు ఇచ్చారు’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. గతంలో తెలుగుదేశం పార్టీతో మిలాఖత్ అయి రాజకీయ కక్షతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జైలుకు పంపించిన కాంగ్రెస్ ...ఇప్పుడు నంద్యాల ఎన్నికల్లో టీడీపీకి మేలు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... టీడీపీ, కాంగ్రెస్ పార్టీల దొంగ నాటకాలను ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ వాళ్లు చంద్రబాబు అవినీతి సొమ్ము తీసుకుని వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
కుట్రలు మీరు చేసి జగన్‌పై విషప్రచారమా?
కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, అన్యాయాలు, అవినీతితో వ్యవస్థను భ్రష్టు పట్టించిన చంద్రబాబు నాయుడు వాటిని కప్పిపెట్టుకుని తాను చెప్పినట్టల్లా ఆడే చానళ్లు, పత్రికల సాయంతో జగన్‌మోహన్‌రెడ్డిపై విషప్రచారాలు సాగిస్తున్నాడని భూమన విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న దుర్మార్గ, నీచ నికృష్ట పాలనపై దండయాత్ర సాగించి దానిని కచ్చితంగా ఖతం చేయాల్సిన అవసరం ఉందని జనం భావిస్తున్నారని, దానినే తన గొంతు ద్వారా జగన్ వినిపించారు తప్ప ఎవరిపైనా ఆయనకు వ్యక్తిగత ద్వేషం లేదని వివరించారు. ‘ఎంతో హింస సాగించిన చంద్రబాబు శాంతిపావురమా? ఏనాడూ ఒక్క హింసాయుత సంఘటనలో పాల్గొనని, మాటలు మాట్లాడని జగన్ హంతకుడట. చంద్రబాబు ఏది చెబుతాడో దానికి వ్యతిరేకంగా చేస్తాడు. చంద్రబాబు, సోనియా ఇద్దరూ కలిసే కుట్రలు పన్ని జగన్‌పై సీబీఐని ఉసిగొల్పి 16 నెలలు జైలులో నిర్బంధించారు.’ అని భూమన వివరించారు.
జగన్ వ్యక్తిత్వం ముందు మీరెంత?
‘ఎంత స్థాయిలో నిర్బంధం ఎదురైనా ఏనాడూ జగన్ వెనుకంజ వేయలేదు. అలజడి నా జీవితం, ఆందోళన నా ఊపిరి, తిరుగుబాటు నా వేదాంతం అంటూ ప్రజా క్షేత్రంలో ప్రజల జీవితాలతోమమేకమై పోరాడుతున్న యోధుడు, యుద్ధవీరుడు జగన్’ అని భూమన వివరించారు. జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వం ముందు చంద్రబాబు చిట్టెలుక అని భూమన వ్యాఖ్యానించారు. నీచాతినీచమైన చరిత్ర చంద్రబాబుది. ఎంతగా నిర్బంధించినా వెరవకుండా ప్రజల తరఫున నిలబడి పోరాడుతున్న వ్యక్తి జగన్ అన్నారు. ఈ ఎన్నికలలో మళ్లీ కాంగ్రెస్ చంద్రబాబు ఒక్కటై మా నాయకుడిపై దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
వారికి ఓటేస్తే డ్రెయినేజ్‌లో వేసినట్లే...
కాంగ్రెస్ పార్టీకి వేసే ఓటు డ్రైనేజ్‌లో వేసినట్లేనని భూమన వ్యాఖ్యానించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, ముస్లింలు, కాపులు, దళితులు, విద్యార్థులు సహా అందరికీ చంద్రబాబు మోసం చేశారన్నారు. ఏ ఒక్క వరానికీ ఆయన మేలు చేయలేదని, దేశంలో కెల్లా లోకేశ్‌ను అత్యంత సంపన్నుడిని చేసేందుకు చంద్రబాబు బకాసురుడిలా అవినీతికి పాల్పడుతున్నారన్నారు.
వారు అంటకాగుతూ మాపై దుష్ప్రచారం..
తాము బీజేపీలో కలుస్తున్నట్లుగా ఎల్లో మీడియాతో ప్రచారం చేయిస్తున్నారని, నంద్యాలలో బీజేపీ జెండా కనిపించకుండా ఆ పార్టీతో అంటకాగుతున్న చంద్రబాబు ఎన్నికల వేళ తమపై నిందలు వేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీయే కాకినాడలో బీజేపీని కౌగలించుకుని ఆ పార్టీతో సమన్వయం చేసుకుని ప్రచారం చేస్తోంది. నంద్యాలలో మాత్రం బీజేపీతో కలసి ప్రచారం చేస్తే ముస్లింలు ఓటేయరన్న భయంతో దూరం పాటిస్తూ నాటకాలాడుతున్నారని భూమన వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ఇచ్చిన అవినీతి సొమ్ము ఉపయోగించుకుని పాదయాత్రలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు మేము బీజేపీకి అమ్ముడుపోయామంటూ నిందలు వేస్తున్నారని భూమన విమర్శించారు. నంద్యాల ప్రజలు టీడీపీకి కచ్చితంగా గుణపాఠం చెబుతారని భూమన అన్నారు. పోలింగ్ ఏజెంట్‌లను బెదిరించి, రిగ్గింగ్ చేయాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని, అయితే నంద్యాల ప్రజలు వాస్తవాలన్నీ గ్రహించారని, చంద్రబాబు∙పాపపు పాలనకు తప్పకుండా చరమగీతం పాడతారని భూమన పేర్కొన్నారు.