
‘నంద్యాల ప్రజలకు కసి తీర్చుకునే ఛాన్స్ వచ్చింది’
ఆరు కోట్లమంది ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహానికి నంద్యాల ప్రజలకు కసి తీర్చుకునే అవకాశం వచ్చిందని వైఎస్‌ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
కర్నూలు : ఆరు కోట్లమంది ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహానికి నంద్యాల ప్రజలకు కసి తీర్చుకునే అవకాశం వచ్చిందని వైఎస్‌ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. నంద్యాల ప్రజలు చంద్రబాబు పాలనకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తొలి కానుకగా నంద్యాలను ఇవ్వనున్నారని భూమన మంగళవారమిక్కడ మీడియా సమావేశంలో అన్నారు. నంద్యాల ప్రజలను మాయమాటలతో చంద్రబాబు సర్కార్ మభ్యపెడుతోందన్నారు. పాలన గాలికొదిలేసి మంత్రులంతా నంద్యాలలో మకాం వేశారని, ఓటమి బయంతో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు.
వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులు లక్ష్యంగా పోలీసులతో దాడులు చేయిస్తున్నారన్నారు. తమిళనాడు ఆర్కేనగర్ కంటే నంద్యాల అధ్వానంగా మారుతోందని, ఏ టీడీపీవాళ్ల ఇంటికి వెతికినా డబ్బు దొరకుతుందని ఆయన అన్నారు. చంద్రబాబు అభివృద్ధితో కాకుండా అవినీతి డబ్బుతో గెలుపు సాధించాలనుకుంటున్నారని భూమన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రులు తమ స్థాయిని మించి నంద్యాలలో వీధి రౌడీల్లా మారుతున్నారని, టీడీపీ అంటేనే తెగించి దౌర్జన్యాలకు పాల్పడే పార్టీ అని విమర్శించారు.