
మహానాడు.. సొంత డబ్బా పరనింద
వైఎస్సార్‌సీపీ నేత గట్టు ధ్వజం
హైదరాబాద్: టీడీపీ నిర్వహిస్తోన్న మహానాడు తీరు సొంత డబ్బా పరనిందలా సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఇక్కడ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానిం చారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రజల ఆశలకు అనుగుణంగా, హామీలకు భరోసా ఇచ్చే విధంగా తీర్మానాలు ఉంటాయనుకున్న వారిని వమ్ము చేస్తోందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాబోయే కాలాన్ని చూసి భయపడుతున్నట్లుగా కనిపిస్తోందే తప్ప, పరిపాలన సాగించే దమ్మున్న నాయకుడిగా లేదన్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేయకముందే టీడీపీ కార్యకర్తలను మోసం చేసే చర్యలను చంద్రబాబు చేపట్టారని దుయ్యబట్టారు. 2019 ఎన్నికలకు సిద్ధం కావాలంటూ నాలుగు రకాల కార్యక్రమాలకు సిద్ధపడినట్లుగా కనిపిస్తోందన్నారు.
‘టీడీపీ కార్యకర్తలను మభ్యపెట్టడం, ప్రతిపక్షాన్ని బలహీనపరచాలనే దుర్బుద్ధి, తన నిజస్వరూపం బయటపడకుండా మోడీ ముసుగును కొనసాగించడం, హామీలను తూట్లు పొడిచే పేద అరుపులు అరవడం’ వంటివి ఎంచుకున్నట్లు కనిపిస్తోందన్నారు. ‘టీడీపీ ప్రత్యర్థుల మీద కక్షసాధింపు ఉండదు, రాజశేఖరరెడ్డి పరిపాలన ప్రారంభం కాగానే టీడీపీ కార్యకర్తల హత్యలకు పురిగొల్పారు అంటూ ఒక ద్వేషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ పరిపాలన కేవలం టీడీపీ కార్యకర్తలను చంపడానికి ప్రారంభించిందనడాన్ని.. ఒక్కసారి ఆ కార్యకర్తలు అక్కడ మననం చేసుకోవాలి’ అని అన్నారు.