కడప సిటీ: ‘ఆ మొగోడు ముందు రాజీనామా చేసి ఎన్నికలకు రమ్మనండి.. జగన్‌యాత్రకు వచ్చింది పెళ్లిజనమో.. ఓట్ల జనమో అప్పుడు తెలుస్తుంది’ అని వైఎస్సార్‌సీపీ జమ్మలమడుగు సమన్వయకర్త సుధీర్‌రెడ్డి ధ్వజమెత్తారు. పెళ్లిళ్లకు, బహిరంగ సభలకు వచ్చే వారంతా ఎన్నికల్లో ఓట్లు వేయరంటూ వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రను ఉద్దేశించి మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. యాత్రలో భాగంగా శనివారం ఉదయం వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల శివారులో ఏర్పాటు చేసిన బస వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేస్తే 60 వేల మెజారిటీతో గెలుస్తానని కోతలు కోయడం మాని, రాజీనామాను ఆమోదింపజేసుకోవాలని సవాల్ చేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరడంతో ఆదినారాయణరెడ్డి ఎంత పెద్ద దొంగో జనమందరికీ అర్థమైపోయిందన్నారు. చప్పిడి మాటలు మానుకుంటే ఆదినారాయణరెడ్డికే మంచిదన్నారు. గ్రామానికి చెందిన పదిమంది కార్యకర్తల పేర్లు కూడా తెలియని వ్యక్తి నాయకుడు ఎలా అవుతారని ప్రశ్నించారు.