నిరవధిక నిరాహార దీక్షతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జగన్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ శుక్రవారం పలుచోట్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
ఒంగోలు, న్యూస్‌లైన్: నిరవధిక నిరాహార దీక్షతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జగన్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ శుక్రవారం పలుచోట్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఒంగోలు సంతపేట సాయిబాబా ఆలయంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ జగన్‌ని బలవంతంగా వైద్యశాలకు తరలించినా.. ఆయన దీక్ష కొనసాగిస్తుండగా కొందరు రాజకీయ నాయకులు స్వార్థబుద్ధితో తప్పుడు ఆరోపణలు చేస్తుండటం బాధాకరమన్నారు. పార్టీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గిద్దలూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ వై వెంకటేశ్వరరావు, వివిధ విభాగాల కన్వీనర్లు కేవీ రమణారెడ్డి, వేమూరి సూర్యనారాయణ, ముదివర్తి బాబూరావు, వంకే రాఘవరాజు, ఈర్ల అనిల్‌కుమార్, మల్లవరపు శ్రీనివాసరావు, శ్రీను, రాంబాబు, అంజి పాల్గొన్నారు.
పలుచోట్ల రిలే దీక్షలు:
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావంగా పర్చూరులో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. 13 మంది రిలే దీక్షల్లో కూర్చున్నారు. దీక్షల్లో కూర్చొన్నవారిని పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త గొట్టిపాటి నర్సయ్య తదితరులు కలిసి సంఘీభావం ప్రకటించారు. మార్కాపురంలో పాత బస్టాండ్ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు జగన్‌మోహన్‌రెడ్డి దీక్షను బలవంతంగా భగ్నం చేసే యత్నానికి నిరసనగా నల్ల రిబ్బన్లు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ ప్రదర్శనలో మార్కాపురం వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు జంకె వెంకటరెడ్డి, వెన్నా హనుమారెడ్డి పాల్గొన్నారు. మార్కాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద జరుగుతున్న రిలే దీక్షల్లో పది మంది పాల్గొన్నారు. త్రిపురాంతకంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేసి జగన్ దీక్షకు సంఘీభావం ప్రకటించారు. జగన్ ఆరోగ్యం బాగుండాలని లింగసముద్రంలో వైఎస్సార్ సీపీ నాయకులు వివిధ ఆలయాల్లో పూజలు నిర్వహించారు.
తెలంగాణ ఉద్యమం స్వార్థ రాజకీయ ప్రేరేపితం: నూకసాని
తెలంగాణ ఉద్యమం కేవలం స్వార్థ రాజకీయ ప్రేరేపిత ఉద్యమంగా వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కుట్రల ఫలితంగా రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారని, అయినా హృదయంలేని బండరాయిగా కేంద్ర ప్రభుత్వం మారిందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని బలోపేతం చేసే దిశగా శనివారం కలెక్టరేట్ ఎదురుగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో రోడ్లు ఊడ్చే కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి నిరసన తెలియజేయనున్నట్లు బాలాజీ ప్రకటించారు.
జగన్ దీక్షను యువత స్వాగతిస్తోంది
పైనం నాగరాజు, సమైక్యాంధ్ర ఫ్రంట్ అధ్యక్షుడు
ప్రజల గుండె చప్పుడు తెలిసిన నాయకుడు జగన్. జైలులో ఉన్నా..ఆస్పత్రిలో ఉన్నా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. జగన్ దీక్షను యువత స్వాగతిస్తోంది. చంద్రబాబు బస్సు యాత్ర పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు. ఆయన సమైక్య వాదా కాదా అనేది స్పష్టం చేసి బస్సు యాత్ర చేయాలి. లేనిపక్షంలో యాత్రను అడ్డుకుంటాం.
ప్రజల కోసం ఏమైనా చేసే వ్యక్తి జగన్ కుంచా అశోక్, ప్రైవేటు ఉద్యోగి, ఒంగోలుసమైక్యాంధ్ర కోసం జగనన్న చేపట్టిన నిరాహార దీక్షకు యువత అంతా సంఘీభావం తెలుపుతోంది. ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా ప్రజా సమస్యలపై ఏ నాయకుడు ఇలా దీక్ష చేయలేదు. ఒక్క జగనే ప్రజల కోసం ఏమైనా చేస్తాడని మేమంతా నమ్ముతున్నాం. రాష్ట్రాన్ని విభజిస్తే విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోతాం. నీటి సమస్యతో అభివృద్ధి కుంటుపడుతుంది.
మేమంతా జగన్ వెంటే..
చప్పిడి విజయమ్మ, ఒంగోలు
ఆస్పత్రిలో ఉండి కూడా జగనన్న ప్రజల కోసం నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన కోసం మేం ఏం చేయడానికైనా సిద్ధం. సమైక్యాంధ్రను సాధించే వరకు మేమంతా జగన్‌తో కలిసి ఉద్యమిస్తాం.
జగన్‌ను అక్రమంగా జైల్లో పెట్టారు
సంగా బుజ్జమ్మ, ఒంగోలు
జగన్‌ను అక్రమంగా జైల్లో పెట్టించారు. అయినా జనం మనిషి కాబట్టే సమైక్యాంధ్ర కోసం ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రజల కోసం తపించే మహోన్నత వ్యక్తి జగన్.