హోదా కోసం..ఎందాకైనా | ys jagan indefinite hunger strike from today | Sakshi
Sakshi News home page

హోదా కోసం..ఎందాకైనా

Published Wed, Oct 7 2015 1:21 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

హోదా కోసం..ఎందాకైనా - Sakshi

హోదా కోసం..ఎందాకైనా

నేటి నుంచి జగన్ నిరవధిక నిరాహార దీక్ష
అన్ని వర్గాల్లో వెల్లువెత్తుతున్న సంఘీభావం
ఊరూ, వాడా కదలిరానున్న వైనం
 

రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణాలే పణంగా నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమైన జగన్‌కు వివిధ వర్గాల నుంచి పెద్దఎత్తున సంఘీభావం వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా రానిదే భవిష్యత్తు అంధకారం అని గ్రహించి పలువురు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మీతో పాటు మేమున్నాం... అంటూ మద్దతు ప్రకటిస్తున్నారు. పార్టీ సోమవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి దాదాపు 30 ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు హాజరై మద్దతివ్వడమే ఇందుకు నిదర్శనం.
 
గుంటూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకోసం నేటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు. నల్లపాడు రోడ్డులో మిర్చియార్డుకు సమీపంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వారం   రోజుల నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా, నగర అధ్యక్షులు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిల పర్యవేక్షణలో ఏర్పాట్లు జరిగితే ఇతర అనుబంధ విభాగాల నేతలు, కార్యకర్తలు తమ వంతు సహకారం అందించారు. పార్టీ నేతలు ఎక్కడికక్కడ నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి సమావేశాలను ఏర్పాటు చేసుకుని జగన్ దీక్షకు పెద్దఎత్తున తరలిరావడానికి ప్రణాళికను రూపొందించుకున్నారు. ప్రత్యేక హోదాతో లభించనున్న ప్రయోజనాలపై అవగాహన కలిగిన వివిధ సేవా సంఘాలు స్వచ్ఛందంగా సమావేశాలు నిర్వహించి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దీక్షకు సంఘీభావం వ్యక్తం చేశాయి. వైఎస్సార్‌సీపీ సోమవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి దాదాపు 30 ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు హాజరై  దీక్ష కొనసాగే వరకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇవ్వడం గమనార్హం. మంగళవారం వర్తక, వాణిజ్య రంగాలకు చెందిన సంఘాలు సమావేశమై జగన్ దీక్షకు సంఘీభావం వ్యక్తం చేశాయి.

సర్వం సిద్ధం...
గత నెల 26వ తేదీన నగరంలోని ఉల్ఫ్‌హాల్ గ్రౌండ్‌లో దీక్ష చేపట్టడానికి పార్టీ నిర్ణయించగా, రాష్ట్ర ఫ్రభుత్వం కుంటిసాకులతో ఆ దీక్షను నిలిపివేసింది. కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహ పడకుండా అందరికీ అనుకూలంగా ఉండే ప్రదేశంలో దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు.  పెద్ద సంఖ్యలో నాయకులు ఆశీనులు కావడానికి అనువుగా వేదికను ఏర్పాటు చేశారు. వక్తల ప్రసంగాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాయకుల ప్రసంగాలు లేని సమయాల్లో వేదికకు ఇరువైపులా ఏర్పాటుచేసిన ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ద్వారా  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాలు. నిర్వహించిన కార్యక్రమాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు పార్టీ సాంస్కృతిక విభాగానికి చెందిన కళాకారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారని రాష్ట్ర ప్రోగామ్స్ కమిటీ కన్వీనరు తలశిల రఘురామ్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరానున్న ప్రజలకు తూర్పు ఎమ్మెల్యే మొహ్మద్ ముస్తఫా ఆధ్వర్యంలో ఉచితంగా మినరల్ వాటర్ సరఫరా చేయనున్నారు.

 ప్రత్యేక ఆకర్షణగా ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలు
 రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు చుట్టుగుంట సెంటరు నుంచి భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. రోడ్లకు ఇరువైపులా, డివైడరు మధ్యలో వీటిని ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దీక్షా ప్రాంగణం ఎదుట ఏర్పాటు చేసిన ద్వారం (ఆర్చి) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నగర, జిల్లా నాయకులు నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో  జగన్ దీక్షకు మద్దతుగా పలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

 మంగళవారం నుంచే ప్రారంభమైన సందడి...
 దీక్షా శిబిరం వద్దకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు మంగళవారం మధ్యాహ్నం నుంచే వచ్చి ఏర్పాట్లు పరిశీలించడం ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో శిబిరం వద్ద సందడి ప్రారంభమైంది. బుధవారం ఉదయం 9 గంటల సమయంలో జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డుమార్గంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన కనకదుర్గమ్మను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి నేరుగా గుంటూరులోని దీక్షా శిబిరానికి చేరుకుని దీక్షను ప్రారంభిస్తారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement