క్షతగాత్రులకు ఆర్థికసాయం అందజేస్తున్న వేమిరెడ్డి, బీవై రామయ్య
కల్లూరు(రూరల్): ఓర్వకల్లు సమీపంలో ఈ నెల ఏడున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్న రాముడు, బెస్త రాముడుతో పాటు పంచలింగాలకు చెందిన డ్రైవర్ రాఘవేంద్ర కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. వీరు కోడుమూరు నేత కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన విషయం విదితమే. వీరి కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ పార్టీ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి శనివారం ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల ప్రకారం మొత్తం రూ.9 లక్షల నగదు అందించారు. ముందుగా ఆయన పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కోడుమూరు నియోజకవర్గ నేత కోట్ల హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి నగరంలోని 33వ వార్డు శివరామకృష్ణనగర్‌లో నివాసం ఉంటున్న చిన్నరాముడు, బెస్త రాముడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కన్నీటి పర్యంతమైన వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు.
చిన్నరాముడు భార్య భార్గవికి రూ.3 లక్షలు, బెస్త రాముడు అక్క కాంతమ్మకు రూ.3 లక్షలు, డ్రైవర్ రాఘవేంద్ర కుమార్తెలు ఆదిలక్ష్మీ, నాగమణి, కుమారుడు ఛత్రపతికి రూ.3 లక్షలు, గాయపడిన పరుశురాముడుకు రూ.20 వేలు, లక్ష్మన్నకు రూ.20 వేల నగదు అందజేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న చిన్నరాముడు ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం రాగానే చిన్నరాముడు ఇంటిని కూడా పూర్తి చేయిస్తామన్నారు. పిల్లల చదువుకు చేయూతనిస్తామన్నారు. బీవై రామయ్య మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ఎవరూ అధైర్యపడొద్దని, ఏ కష్టం వచ్చినా వెన్నంటే ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కల్లూరు మండల కన్వీనర్ రెడ్డిగారి చంద్రకళాధర్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆదిమోహన్‌రెడ్డి, అక్కిమి హనుమంతరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రఘు, పర్ల శ్రీధర్‌రెడ్డి, కర్నూలు పార్లమెంటరీ జిల్లా కార్యదర్శులు కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శి తోఫిక్, రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి ఫిరోజ్, 33, 36 వార్డు ఇన్‌చార్జ్‌లు షరీఫ్, నాగరాజు, పార్టీ నాయకులు పాణ్యం మహేశ్వర్‌రెడ్డి, కాటసాని శివనరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment