
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ప్రజాసంకల్ప యాత్ర ద్వారా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్షల మందితో మమేకం అవుతున్నారని, రాబోయే రోజుల్లో రాష్ట్రానికి దశాదిశా జననేతేనని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతకు ముందు వైఎస్‌ఆర్‌సీపీ నేత, రాయలసీమ రిటైర్డు ఐజీ మహమ్మద్ ఇక్బాల్‌ను పూలబొకేలతో సత్కరించారు.
ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుండడంతో ఎంతో మంది నాయకులు ఆకర్షితులవుతున్నారన్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ కూడా జననేత అడుగు జాడల్లో నడిచేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇక్బాల్ సేవలు ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, పార్టీలో నూతనోత్సాహం వచ్చిందని తెలిపారు. టీడీపీ అడుగడుగునా అణచివేత ధోరణి అవలంబిస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మభ్యపెడుతోందన్నారు.
అన్నపూర్ణ లాంటి ఏపీకి అడుక్కుతినే పరిస్థితి
రిటైర్డు ఐజీ ఇక్బాల్ మాట్లాడుతూ.. అన్నపూర్ణ లాంటి ఏపీకి ప్రస్తుతం అడుక్కుతినే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పేరిట రైతుల నుంచి భూములు లాక్కుందని, అవి ఎందుకూ పనికిరాకుండా నేడు బీడుగా మారాయని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రణాళికలు ప్రజల అవసరాలకు భిన్నంగా ఉంటున్నాయన్నారు. నాలుగేళ్ల పాటు ప్రత్యేక ప్యాకేజీ పాట పాడిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల విశ్వసనీయత కోల్పోయి ఇప్పుడు యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా అనడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. అనుభవం, సీనియారిటీ పనికి రావనేది బాబు పాలనతో తేటతెల్లం అయిందన్నారు. చిత్తశుద్ధి కలిగిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిలాంటి నాయకుడు అవసరం ఉందని రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో పేర్కొంటున్నారని తెలిపారు.
కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఓ పోరాట యోధుడన్నారు. రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి ఆయనేనని చెప్పారు. మచ్చలేని ఓ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, మైనారిటీసెల్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎ.రహ్మాన్, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్.మద్దయ్య, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి రఘునాథ్, లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, జిల్లా నాయకుడు తోట వెంకటకృష్ణారెడ్డి, పార్టీ నాయకులు దేవపూజ ధనుంజయాచారి, ఫిరోజ్, పర్ల శ్రీధర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, రాజేశ్, విజయకుమారి, సయ్యద్ ఆసిఫ్, కె.రాఘవేంద్రరెడ్డి, ప్రదీప్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్ నాయుడు, రైల్వే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment