
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీసీల సంక్షేమం, వారి అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘బీసీ డిక్లరేషన్’ను రూపొందించబోతున్నది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలోని బీసీల స్థితిగతులు, వారి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో తెలుసుకోవడానికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర స్థాయిలో బీసీ ముఖ్య నేతల సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటయ్యాక తొలిసారిగా విస్తృతస్థాయిలో జరుగుతున్న ఈ సమావేశానికి 13 జిల్లాల నుంచి పార్టీకి చెందిన బీసీ ముఖ్య నేతల్ని ఆహ్వానించారు.
ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశమున్న ఈ సమావేశంలో వైఎస్ జగన్ నేతలందరి అభిప్రాయాలు, సూచనలను తీసుకుంటారు. ఆయా జిల్లాల్లో స్థానికంగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, బీసీల విషయంలో పాలకవర్గం వ్యవహరిస్తున్న తీరు, ఇలా అనేక అంశాలపై కూలంకుషంగా చర్చిస్తారని సమాచారం. సమావేశంలో నేతలు వ్యక్తపరిచే అభిప్రాయాలు, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక తీసుకోవాల్సిన చర్యలు వంటి వాటిని క్రోడీకరిస్తారు. ఆ తర్వాత ఉన్నత స్థాయిలో మరిన్ని దఫాలు సంప్రదింపులు జరిపి.. సమగ్రంగా రూపకల్పన చేశాక తగిన సమయంలో పార్టీ తరఫున ‘బీసీ డిక్లరేషన్’ను చేస్తారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్‌తోపాటుగా పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలు కూడా పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment