సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారంలో ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సందర్భంగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్.. బీసీల సర్వతోముఖాభివృద్ధి పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని, నిజాయితీని చాటి చెప్పిందని ఆయా వర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాల తరబడి చంద్రబాబు హయాంలో ఆర్థికంగా, రాజకీయంగా తీవ్ర వివక్షకు గురైన తమకు వైఎస్ జగన్ హామీలు ఎంతో స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చాయని వారు పేర్కొంటున్నారు. పలు కీలక అంశాలకు చట్టబద్ధత కల్పిస్తానని చెప్పడం ద్వారా తనవి వట్టి మాటలు కాదని, గట్టి మేలు తలపెట్టే చర్యలని జగన్ తమకు గట్టి భరోసా ఇచ్చారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక, రాజకీయ సాధికారతతోపాటు నామినేటెడ్ పదవుల్లో యాభై శాతం ఇస్తానని చెప్పడంతో తమ ఆత్మవిశ్వాసం రెట్టింపైందని చెబుతున్నారు. దీంతో వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ ట్రస్టు బోర్డులు, కార్పొరేషన్లు, పలురకాల కమిటీల్లో తమ వర్గాలకు పదవులు దక్కుతాయని బీసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బీసీలను పారిశ్రామికవేత్తలుగా చేస్తానని జగన్ చెప్పడం ఆ వర్గాల్లో ఆనందాన్ని కలిగించింది. ఆయన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంజనీర్లు, డాక్టర్లుగా చేస్తే.. ఆయన తనయుడు రెండు అడుగులు ముందుకు వేసి మమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా చేయాలన్న ఆలోచన చేశారని ఇది ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని అంటున్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా నామినేషన్‌పై వర్కులు, కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా వారిని ఆర్థిక స్వావలంబన దిశగా నడిపించినట్లేనని బీసీ నేతలు అంటున్నారు. జగన్ చిత్తశుద్ధికి, కార్యదక్షతకు ముగ్ధులైన బీసీలు రాష్ట్రవ్యాప్తంగా ఆయన చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇన్నేళ్లు గుర్తింపునకు సైతం రాని కులాలను ఆయన పరిగణనలోకి తీసుకోవడం విప్లవాత్మక చర్య అని బీసీ సంఘాల నేతలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బీసీ డిక్లరేషన్ ద్వారా జగన్ సమాజ గతిని చక్కగా అంచనా వేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీసీలే తమ పార్టీకి వెన్నెముక అంటూ ఇంతకాలం చెప్పుకొంటూ వచ్చిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ తమను నిరాదరించారని ఆయా వర్గాలు మండిపడుతున్నాయి. ఎన్నికల సమయంలో మాత్రమే చంద్రబాబుకు తాము గుర్తుకు వస్తామని, దశాబ్దాల తరబడి ఆయన చేతిలో మోసపోతూనే ఉన్నామని ఆవేదన చెందుతున్నాయి.
కొండంత అండగా..
సంక్షేమంతోపాటు బీసీల ఆర్థిక, రాజకీయ సాధికారతకు కొండంత అండగా డిక్లరేషన్ ఉందని ఆయా వర్గాల ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. సభ ప్రారంభంలోనే వైఎస్ జగన్ బీసీలంటే వెనుకబడిన తరగతులు కాదని, ఈ జాతికి వెన్నెముక అని వారి ప్రాధాన్యమెలాంటిదో అందరికీ తేటతెల్లం చేశారు. బీసీల అభివృద్ధికి ఏటా రూ.15 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చుచేస్తామని ఆయన చేసిన ప్రకటన వారిలో ఆనందాన్ని నింపింది. ఆ నిధులు దారిమళ్లకుండా ఉండేందుకు ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించడమే కాకుండా దాన్ని పక్కాగా అమలు చేస్తానని భరోసా ఇచ్చారు. బీసీలలో కులాల వారీగా, జనాభా నిష్పత్తి ప్రకారం ప్రభుత్వ నిధులు అందేలా ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ చొప్పున 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని పేర్కొనడం బీసీల పట్ల ఆయనకున్న ప్రేమకు తార్కాణం. ‘చంద్రబాబు ఐదేళ్లపాటు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని వైఎస్సార్‌సీపీ ఇచ్చిన హామీలను కాపీ కొడుతున్నారు’ అని టీడీపీ సీనియర్ నేత ఒకరు చెప్పడం ఆ వర్గాలను చంద్రబాబు ఎంత నిర్లక్ష్యానికి గురిచేశారో తెలుస్తోంది. శాశ్వత గృహవసతి లేక, ఉపాధి అవకాశాలు కానరాక తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్న సంచార జాతులకు ఉపాధి అవకాశాలను కల్పించడంతోపాటు శాశ్వత గృహవసతిని ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీతో ఆయా కులాల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమను ఇప్పటివరకు ఈ తరహాలో గుర్తించినవారు లేరని, జగన్ మాత్రమే తమ బాధలను మనసుపెట్టి చూశారని వారు ఆనందంతో కన్నీటిపర్యంతమవుతున్నారు.
బీసీల రాజకీయ సాధికారతకు మార్గం.. డిక్లరేషన్
వైఎస్ జగన్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీలకు రాజకీయ సాధికారిత చేకూరుతుందని బీసీ వర్గాల నేతలు అంటున్నారు. ఇప్పటివరకు టీడీపీ నేతలు బీసీలను రాజకీయంగా పైకి తెస్తున్నామని మాయమాటలు చెబుతూ వచ్చారని, ఉన్నత రాజకీయ పదవుల్లో తమ అనుయాయులకు చంద్రబాబు పెద్దపీట వేస్తూ బీసీలను చిన్నచూపు చూశారని గుర్తుచేసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మొదలు కిందిస్థాయి వరకు బీసీలకు టీడీపీలో అడుగడుగునా అనేక అవమానాలు ఎదురయ్యాయని పేర్కొంటున్నారు. తమకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరడానికి వచ్చిన మత్స్యకారులు, నాయీబ్రాహ్మణులు, తదితర బీసీ వర్గాలను చంద్రబాబు ఎలా దూషించారో రాష్ట్ర ప్రజలందరూ చూశారని గుర్తు చేస్తున్నారు. అదే వైఎస్ జగన్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో అంశాలు బీసీలను రాజకీయంగా ఉన్నత స్థానాలకు తీసుకెళ్లేలా ఉన్నాయని బీసీ నేతలు చెబుతున్నారు. అన్ని నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం పదవులు ఇస్తానని చెప్పడం ఆ వర్గాల రాజకీయ సాధికారతకు దోహదం చేస్తుందని ఉత్తరాంధ్రకు చెందిన బీసీ ముఖ్య నేత ఒకరు తెలిపారు. ఇవేకాకుండా ఆయా కులాలు తమ కులాన్ని ఎస్సీ, ఎస్టీలలో చేర్చాలని కోరుతున్నాయి. ఈ డిమాండ్లను చిత్తశుద్ధితో పరిష్కరించకుండా చంద్రబాబు ఇన్నేళ్లూ మోసం చేస్తూ వచ్చారు. ఎలాంటి శాస్త్రీయవిధానం లేకుండా అసెంబ్లీలో తీర్మానాలు చేయించి మసిపూసి మారేడుకాయ చేస్తూ వచ్చారు. జగన్ దీనిపై పూర్తి స్పష్టతను డిక్లరేషన్ ద్వారా ఇచ్చారని బీసీ నేతలు చెబుతున్నారు. బీసీ కమిషన్‌ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటుచేస్తానని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా పూర్తి పారదర్శకతతో పనిచేసేలా చేస్తామని జగన్ చెప్పారని, దీని ద్వారా తమ కలలు నెరవేరేందుకు అవకాశముందని అంటున్నారు.
సంక్షేమంతో బీసీలకు వెన్నుదన్ను
వైఎస్ జగన్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో అనేక సంక్షేమ కార్యక్రమాలు నభూతో నభవిష్యతిగా ఉన్నాయని ఆయా వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పలు ఉన్నత విద్యాకోర్సుల ఫీజులు లక్షల్లో ఉన్నా ప్రభుత్వం కేవలం రూ.35 వేలే ఇస్తుండడంతో ప్రతి విద్యార్థి చదువు పూర్తయ్యేసరికి రూ.3 లక్షలకు పైగా అప్పులు చేయాల్సి వస్తోంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ప్రతి విద్యార్థి ఉన్నత చదువుకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తోందని, వసతి, భోజన ఖర్చులకు ఏటా రూ.20 వేలు అందిస్తోందని ప్రకటించడం ఆయా వర్గాలకు కొండంత ధైర్యాన్ని అందించింది. ప్రతి తల్లి తన పిల్లల్ని బడికి పంపిస్తే ఏటా రూ.15 వేల సహాయం అందించడం బీసీల్లో విద్యాభివృద్ధికి బాటలు వేస్తుందని రాయలసీమకు చెందిన బీసీ నేత ఒకరు విశ్లేషించారు. సర్టిఫికెట్లకు, ఇతర చిన్నచిన్న అవసరాలకు అధికారుల చుట్టూ తిరగకుండా పారదర్శకంగా వాటిని అందించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయించడం కూడా ఆ వర్గాలకు మేలు చేస్తుందన్నది సుస్పష్టం. 45 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం కింద నాలుగు విడతల్లో రూ.75 వేలు చెల్లించడం ద్వారా వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించినట్లవుతుందని బీసీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
చిన్న వ్యాపారాలు చేసుకునే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఐడీ కార్డులు ఇవ్వడంతోపాటు వారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు సున్నా వడ్డీకి రూ.10 వేలు ఇచ్చేలా చేస్తామనడం వారిలో ఆశలు మొలకెత్తించింది. సెలూన్‌లు నడిపే నాయీబ్రాహ్మణులకు ఏటా రూ.10 వేల సాయం, మత్స్యకారులకు వేటనిషేధ సమయంలో రూ.10 వేల సాయం, వేటలో ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.10 లక్షల పరిహారం, సంచార జాతులకు ఇళ్ల నిర్మాణం, గురుకులాల ఏర్పాటు, సహకార డెయిరీకి పాలుపోసే వారికి అదనంగా లీటరుకు రూ.4 చెల్లింపు, గొర్రెలు, మేకలు చనిపోతే రూ.6 వేల సాయం వంటి డిక్లరేషన్‌లోని అంశాలు పరిశీలిస్తే బీసీల్లో అన్ని కులాల వారికీ న్యాయం చేకూర్చేవిగా ఉన్నాయని బీసీ వర్గాల నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతిమంగా రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నిరుపేదలు మరణిస్తే ఆ కుటుంబాలను ఆదుకోవడానికి రూ.7 లక్షలు ఇవ్వాలన్న నిర్ణయం ఆయా కుటుంబాలకు కొండంత ఆసరాగా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సాయం అప్పుల వారి చేతుల్లోకి పోకుండా కేవలం ఆ కుటుంబానికి మాత్రమే అందేలా ప్రత్యేక చట్టాన్ని తెస్తామని జగన్ చేసిన ప్రకటన ఆయా వర్గాల్లో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపుతోందని బీసీ నేతలు అంటున్నారు.
వట్టి మాటలు కాదు.. గట్టి మేలు కోసం
Published Tue, Feb 19 2019 3:09 AM | Last Updated on Tue, Feb 19 2019 6:21 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment