తెలుగుదేశం ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలు.. తద్వారా రైతులు, నిరుద్యోగులకు జరుగుతున్న నష్టంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
మండల కేంద్రాల్లో
వైఎస్‌ఆర్‌సీపీ ధర్నాలు, ర్యాలీలు
ఎన్నికల హామీలు అమలు
చేయాలని డిమాండ్
తహశీల్దార్లకు వినతిపత్రాల సమర్పణ
నేడు కూడా పలు మండలాల్లో ధర్నాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:తెలుగుదేశం ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలు.. తద్వారా రైతులు, నిరుద్యోగులకు జరుగుతున్న నష్టంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఉద్యమబాట పట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ శ్రేణులు తహశీల్దార్ కార్యాలయాల ఆందోళన నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. మంగళవారం కూడా పలు మండలాల్లో ఇదే తరహా ఆందోళనలు చేయనున్నారు. శ్రీకాకుళం తహశీల్దార్ కార్యాలయంలో జిల్లా, పట్టణ, మండల నాయకులు భారీ ఎత్తున ధర్నాకు దిగారు. అనంతరం
తహాశీల్దార్ సాధు దిలీప్‌చక్రవర్తికి డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు. ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలోని కంచిలిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి తహశీల్దార్ టి. కళ్యాణచక్రవర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి పి.ఎం. తిలక్, ఇప్పిలి క్రిష్ణారావు, పలికల భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు. సోంపేటలోనూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్టీ సమన్వయకర్తలు నర్తు రామారావు, పిరియా సాయిరాజ్, పీఏసిఎస్ అధ్యక్షుడు రౌతు విశ్వనాధం, సర్పంచ్‌ల సంఘ అధ్యక్షుడు పాతిన శేషగిరి, తదితరులు పాల్గొన్నారు.
ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని రణస్థలం తహశీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాకు నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, జెడ్పీటీసీ గొర్లె రాజగోపాలరావు, నాయకత్వం వహించారు. ఎచ్చెర్ల తహశీల్దార్ కార్యలయం వద్ద మాజీ ఎంపీపీ బల్లాడ జనార్దనరెడ్డి తదితరులు ప్రభుత్వం హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ తహశీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని మెళియాపుట్టిలో పార్టీ శ్రేణులతో ర్యాలీ నిర్వహించిన అనంతరం పార్టీ మండల కన్వీనర్ సలాన వినోద్ కుమార్ ఆధ్వర్యంలో తహశీల్దారు కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. పాతపట్నంలోనూ పార్టీ కార్యాలయం నుంచి తహశీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉప తహశీల్దారు డి.రాజేశ్వరరావుకు వినతిపత్రం ఇచ్చారు. పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కొండాల అర్జునుడు నాయకత్వం వహించారు.పాలకొండ నియోజకవర్గం సీతంపేటలో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.