హోదా మహోద్యమం | YSRCP Leaders Protests For Special Status | Sakshi
Sakshi News home page

హోదా మహోద్యమం

Published Mon, Apr 9 2018 6:19 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

YSRCP Leaders Protests For Special Status - Sakshi

మడకశిరలో వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త తిప్పేస్వామి ఆధ్వర్యంలో రోడ్డుపై వంటా వార్పు చేస్తున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

అనంతపురం : హోదా పోరు మహోద్యమంగా మారుతోంది. చిన్నా,పెద్దా తేడా లేకుండా అందరూ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ నినదిస్తున్నారు. ప్రత్యేకహోదా సాధన కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడంతో వారికి  మద్దతుగా ‘హోదా’ పోరు సాగిస్తున్నారు.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ రిలేదీక్షలు కొనసాగాయి. జాతీయ రహదారులపై వంటావార్పు కార్యక్రమాలు చేపట్టి నిరసన తెలియజేశారు. తాడిపత్రి పట్టణంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు పైలా నరసింహయ్య, వైఎస్సార్‌ విద్యార్థి విభాగం ఎస్కేయూ అధ్యక్షుడు భానుప్రకాష్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష రెండరోజుకు చేరుకుంది. హోదా దీక్షలకు ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో ప్రధాని నరేంద్రమోది దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి దహనం చేశారు.

పెనుకొండ ఆర్డీఓ కార్యాలయం వద్ద పార్టీ హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు శంకరనారాయణ అధ్యక్షతన జరిగిన రిలే  దీక్షలకు సీపీఎం నాయకులు మద్దతు ప్రకటించారు. శంకరనారాయణ మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి వైఎస్సార్సీపీ ఎంపీలు  పదవులను తృణప్రాయంగా వదలుకున్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్తే లక్ష్యంగా ఆమరణ దీక్షకు దిగారన్నారు.

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రంలో సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో రెండోరోజు దీక్ష జరిగింది. ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి హాజరయ్యారు. సీఎం చంద్రబాబు నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా బలహీన పడడానికీ పాటుపడ్డారని ఎమ్మెల్యే విశ్వ విమర్శించారు. అనుభవం పేరుతో ప్రజలను వంచించారన్నారు. శిబిరం మందు వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై భోజనాలు చేశారు. ముందుగా శింగనమల నుంచి బుక్కరాయసముద్రం వరకు 200 బైక్‌లతో ర్యాలీ నిర్శహించారు.

మడకశిర పట్టణంలోని వైఎస్‌ విగ్రహం వద్ద నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ తిప్పేస్వామి ఆధ్వర్యంలో రిలే దీక్ష కొనసాగింది. రోడ్డుపైనే వంటవార్పు చేసి అక్కడే భోజనం చేసి నిరసన తెలియజేశారు.  ప్రత్యేకహోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని తిప్పేస్వామి మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైసీ గోవర్దన్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రంగేగౌడ్, బీసీ,ఎస్సీ సెల్‌ కార్యదర్శులు బేకరీ నాగరాజు, సత్యనారాయణ యాదవ్‌ పాల్గొన్నారు.

అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నియోజకవర్గ సమన్వయకర్త నదీమ్‌అహ్మద్‌ ఆధ్వర్యంలో రిలేదీక్షలు రెండోరోజుకు చేరుకున్నాయి. ఆయన మాట్లాడుతూ అసమర్థ చంద్రబాబు పాలనతోనే రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందన్నారు. పార్టీ రాష్ట్ర ప్ర«ధాన కార్యదర్శి రాగే పరశురాం మాట్లాడుతూ ప్రత్యేకహోదా ఉద్యమాన్ని సీఎం నిర్వీర్యం చేశారన్నారు.  

తాడిపత్రి పట్టణంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు పైలా ఆమరదీక్షకు మద్దతుగా విద్యార్థి విభాగం అధ్యక్షుడు మనోజ్, నాగేశ్వరరెడ్డి, ఓబుళరెడ్డి ఆమరణదీక్ష చేపట్టారు.  

సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ పేరం నాగిరెడ్డి పాల్గొన్నారు. టీడీపీ, బీజేపీని నమ్మి ఓట్లేసి గెలిపించిన రాష్ట్ర ప్రజలను ఈరోజు నిలువునా ముంచాయని పెద్దారెడ్డి వాపోయారు. పైలా నరసింహయ్య మాట్లాడుతూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయకుండా ఢిల్లీ వీధుల్లో బైఠాయించడాన్ని ప్రజలు హర్షించరన్నారు.  

ఉరవకొండ పట్టణం టవర్‌క్లాక్‌ వద్ద వైఎస్సార్‌ సీపీ నేతలు చేపట్టిన రిలే దీక్షలకు సీపీఎం నాయకులు రంగారెడ్డి, జ్ఞానమూర్తి, మధుసూదన్‌నాయుడు మద్దతు తెలిపారు. రిటైర్డ్‌ బ్యాంకు మేనేజర్‌ ఓబులేసు, ఏసీ ఎర్రిస్వామి, బోయ సుశీలమ్మ, నిరంజన్‌గౌడ్, జిలాన్‌ మాట్లాడుతూ, ఆరోజు రాష్ట్రం విడిపోవడానికి, హోదా రాకపోవడానికి సీఎం చంద్రబాబు ఒక్కరే కారణం అన్నారు.  

ధర్మవరం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట జరిగిన రిలేదీక్షల్లో  పార్టీ అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు హోదాను తాకట్టుపెడితే.. బీజేపీ ప్రభుత్వం ఆంధ్రులను నమ్మించి మోసం చేసిందన్నారు.  దీక్షకు సీపీఐ, సీపీఎం నాయకులు జంగాలపల్లి పెద్దన్న, బైముతక రమణ, లాయర్‌ రామకృష్ణారెడ్డి, మైనార్టీ నాయకులు రవూఫ్, ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు.

గుంతకల్లు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షల్లో సమన్వయకర్త వై. వెంకటరామిరెడ్డి పాల్గొని ప్రసంగించారు.  ప్రత్యేక హోదా సంజీవనా, హోదా కోసం పోరాడితే జైళ్లకు పంపుతానని యువతను బెదిరించిన చంద్రబాబు ఇప్పుడు హోదా కోసం పోరాడుతున్నట్లు నటించడం సిగ్గుచేటన్నారు.

హిందూపురం పట్టణంలో సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ సర్కిల్‌ నుంచి సద్భావన సర్కిల్‌ వరకు రోడ్లు శుభ్రం చేసి నిరసన తెలియజేశారు. అనంతరం సద్భావన సర్కిల్‌ వద్ద రిలేదీక్షలు ప్రారంభించారు. ప్రత్యేకహోదాతోనే రాష్ట్ర భవిష్యత్తు ఉందని నమ్మి అందుకోసం పోరాడుతున్న ఏకైన నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 

కదిరి పట్టణం అంబేడ్కర్‌ సర్కిల్‌లో సమన్వయకర్త డాక్టర్‌ సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు  జరుగుతున్నాయి. హోదాకోసం పోరాడాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్లుగా చెబుతున్నా.. చంద్రబాబు తన స్వార్థం కోసం ప్యాకేజీకి ఒప్పుకున్నారన్నారు. కమ్యూనిస్ట్‌ పార్టీ నాయకులు సుబ్బిరెడ్డి, నరసింహులు,  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల నాయకులు, మహిళలు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వ్యాపారులు, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు మద్దతు ప్రకటించారు.  

కళ్యాణదుర్గం పట్టణం రెవెన్యూ కార్యాలయం వద్ద జరిగిన రిలే దీక్షల్లో  వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ తిరుమల వెంకటేశులు, పట్టణ కన్వీనర్‌ గోపారం శ్రీనివాసులు, ప్రచార కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంద్రరెడ్డి, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశులు, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్‌కే ఆంజినేయులు పాల్గొన్నారు.  

పుట్టపర్తి పట్టణం హనుమాన్‌ కూడలిలో సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరిగాయి. రోడ్డుపై వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించి భోజనాలు చేసి నిరసన తెలియజేశారు.   

రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు కొనసాగాయి. జెడ్పీటీసీ సభ్యుడు వెన్నపూస రవీంద్రరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులకు భయపడి బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని, దీంతోనే టీడీపీ ఎంపీలు రాజీనామా చేయడంలేదన్నారు. 

రాయదుర్గం పట్టణం లక్ష్మీబజారులో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో దీక్ష జరిగింది. కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ప్రజల సంక్షేమం గాలికొదిలి, స్వలాభం కోసం రాత్రికి రాత్రి  ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవడం దౌర్భాగ్యమన్నారు. అనంతరం స్థానిక వైఎస్సార్‌  సర్కిల్‌లో వంటావార్పు చేసి, రోడ్డుపై భోజనాలు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement