
'మూడు అబద్ధాలు, ఆరు మోసాలు'
ఏలూరు: చంద్రబాబు ఏడాది పాలన మూడు అబద్ధాలు, ఆరు మోసాలుగా సాగిందని వైఎస్సార్ సీపీ నేతలు విజయసాయి రెడ్డి, పార్థసారధి విమర్శించారు. ప్రతిపక్షాన్ని అణగదొక్కడమే విధానంగా చంద్రబాబు పాలన చేస్తున్నారని ఆరోపించారు. ఏడాది పాలనలో చంద్రబాబు చేసిందేమి లేదన్నారు. చంద్రబాబు ఏడాది పాలనకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మంగళవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు.
5 ప్రధాన అంశాలపై వైఎస్ జగన్ సమరదీక్ష చేయనున్నారని వెల్లడించారు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, ప్రత్యేక హోదా, నిరుద్యోగ భృతి, బలవంతపు భూసేకరణకు నిరసనగా జగన్ దీక్ష చేస్తారని చెప్పారు. వైఎస్ జగన్ దీక్షతోనైనా ప్రభుత్వం కళ్లు తెరుస్తుందేమో చూడాలని కొత్తపల్లి సుబ్బారాయుడు, మేకా శేషుబాబు అన్నారు. విభజన వల్లే హామీలు నెరవేర్చలేకపోతున్నామని చంద్రబాబు చెప్పడం పచ్చి మోసమని ధ్వజమెత్తారు.