పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పరిశీలన.. | YSRCP leaders visit Polavaram Project | Sakshi
Sakshi News home page

పోలవరం పనులు పరిశీలించిన వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు

Published Thu, Dec 7 2017 7:07 PM | Last Updated on Tue, May 29 2018 2:28 PM

YSRCP leaders visit Polavaram Project - Sakshi

సాక్షి, ఏలూరు : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు బృందం గురువారం పరిశీలించింది. బస్సు యాత్ర ద్వారా పోలవరం ప్రాజెక్టుకు చేరుకొన్న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నాయకులు  నిర్మాణ పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. స్పీల్‌ వే నిర్మాణ పనులు పరిశీలించారు. వైఎస్‌ఆర్‌సీపీ బృందం పరిశీలనలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ప్రాజెక్టు వద్ద అసలు ఎలాంటి పనులు జరగడం లేదని తేలింది. కాపర్‌ డ్యాం నిర్మాణం మొదలుపెట్టలేదని వెల్లడైంది. ప్రాజెక్ట్‌ నిర్మాణ పనుల పరిశీలన అనంతరం పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు..

పోలవరం జాప్యానికి చంద్రబాబే : వైవీ సుబ్బారెడ్డి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జాప్యానికి చంద్రబాబే కారణమని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. 2018లోగా పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు మాట తప్పారన్నారు. 2019లోగా పోలవరం పూర్తి అయ్యే అవకాశాలు కనిపించడం లేదని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో పోలవరాన్ని కేంద్రమే నిర్మించాలని తీర్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని చంద్రబాబు చేపట్టి, దాన్ని 2019 లోగా కూడా పూర్తి చేసే అవకాశం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును కేవలం ముడుపుల కోసమే చంద్రబాబు తీసుకున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లోనే ఈ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తెచ్చారన్నారు. దురదృష్టవశాత్తు చంద్రబాబు ఈ ప్రాజెక్టును తీసుకోవడంతో ఆలస్యం జరుగుతుందన్నారు. పోలవరం 2019లోగా పూర్తి అయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, పార్లమెంట్‌లో కూడా ప్రశ్నిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

నత్తనడకన  ప్రాజెక్టు పనులు: మేకపాటి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని, ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి విమర్శించారు. గత 15 రోజుల నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చాలా ఆందోళన కలిగించే అంశాలు ఉండటంతో ఇవాళ ప్రాజెక్టును సందర్శించామన్నారు. రాష్ట్ర ప్రజల జీవనాడి అని చెబుతున్న పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ముడుపుల కోసం కేంద్రం నుంచి తీసుకున్నారన్నారు. ఈ ప్రాజెక్టు నిజస్వరూపం తెలుసుకునేందుకే ఇక్కడి వచ్చామన్నారు.  ఇక్కడి అధికారులతో నిర్మాణ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నామన్నారు. ఇక్కడ 48 గేట్లు పెట్టి దాదాపు 50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు నిర్మాణ పనులు సాగుతున్నాయని తెలిసిందన్నారు. ఇంకా ఆరు మాసాల వ్యవధి మాత్రమే ఉందని, మిగతా పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. కేంద్రంపై నెపం వేసి పోలవరం నిర్మాణాన్ని ఆలస్యం చేయొద్దని సూచించారు. ఇప్పటి వరకు కాపర్‌ డ్యామ్‌ల నిర్మాణ పనులు ప్రారంభించలేదన్నారు. పోలవరం పూర్తయితేనే రాష్ట్రం అన్నపూర్ణాంధ్రగా మారుతుందన్నారు. వీటికి సమాధానం చెప్పాలని మేకపాటి ముఖ్యమంత్రిని కోరారు.

ఎక్కడ వేసిన పనులు అక్కడే: బొత్స
పోలవరం ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారాయని, కనీసం మట్టి వేసిన పాపాన పోలేదని వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎయస్‌ రాజశేఖరరెడ్డి 12 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని ఆయన అన్నారు. తొమ్మిదేళ్ల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు అప్పట్లో పోలవరాన్ని పట్టించుకోకపోవడంతో మహానేత ముందుకు వచ్చారని తెలిపారు. సుమారు రూ.4700 కోట్ల నిధులు వైఎస్‌ఆర్‌ హయాంలో ఖర్చు చేశారని గుర్తు చేశారు. కేంద్రాన్ని ఒప్పించి, మెప్పించి పోలవరానికి అన్ని అనుమతులు తెచ్చారన్నారు.

దురదృష్టవశాత్తు మహానేత మరణించడం, ఆ తరువాత రాష్ట్ర విభజన జరిగిందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరాన్ని కేంద్రమే నిర్మిస్తుందని చట్టం చేశారన్నారు. అయితే ఈ ప్రాజెక్టును రాష్ట్రమే కడుతుందని చంద్రబాబు కోరడంతో ఆ బాధ్యతలు రాష్ట్రానికి ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టి, ముడుపుల కోసం పోలవరం ప్రాజెక్టును తీసుకున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం పిలుస్తున్న టెండర్లు, కాంట్రాక్టర్లు లోపభూయిష్టంగా ఉందని కేంద్రమే అభ్యంతరం తెలుపుతుందని గుర్తు చేశారు.

పోలవరం నిర్మాణానికి వైఎస్‌ఆర్‌సీపీ సహకరిస్తుందని, ఈ పనులు ఏ విధంగా సాగుతుందని పరిశీలించేందుకు ఇవాళ ఇక్కడికి వచ్చామన్నారు. ఎక్కడ కూడా మట్టి వేసిన పాపాన పోలేదన్నారు. పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయని తెలిపారు. కాపర్‌ డ్యాం కడితే కనీసం నీరు నిల్వ ఉంటుందన్నారు. నాబార్డు నుంచి ఇప్పటికే రూ.5 వేల కోట్లు డ్రా చేశారని, మిగతా డబ్బులు ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. ఆర్‌అండ్‌ఆర్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.  చంద్రబాబు ఎప్పుడైనా పోలవరం కోసం ఒక్కమాటైనా మాట్లాడారా అని బొత్స  ప్రశ్నించారు. టీడీపీ ద్వంద వైఖరి, ద్వంద విధానాలు వీడాలని, పోలవరం విషయంలో మోసం చేసి చరిత్రహీనులుగా మిగలవద్దని, సకాలంలో పోలవరం పనులు పూర్తి చేయాలని బొత్స సత్యనారాయణ హితవు పలికారు.

ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా: వర ప్రసాదరావు
రాష్ట్రంలో చంద్రబాబు  ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా అని ఎంపీ వరప్రసాదరావు ప్రశ్నించారు. పోలవరంలో ఇంకా 45 గేట్లు నిర్మించాల్సి ఉందన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రమే ఈ ప్రాజెక్టును పూర్తి చేయించి, ప్రజలకు ఉపయోగకరంగా మార్చాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement