మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ధ్వజం
గుంటూరు : రాష్ట్ర విభజన జరిగిన ఏడాది తర్వాత సెక్షన్ 8 గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి కేంద్ర సాయం వంటివేవీ గుర్తుకు రాకపోవటం విడ్డూరంగా ఉందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఇంత హడావుడిగా ఆయన దిల్లీ వెళ్లి మకాం వేసింది తన పదవిని కాపాడుకొనేందుకేనని ప్రజలందరికీ అర్థమైందన్నారు. ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టి తనవైపు తిప్పుకొన్నారని, అధికారం కోసం గడ్డి తినేందుకైనా సిద్ధపడే బాబు ఏసీబీ వలలో చిక్కుకునే సరికి రాష్ట్రానికే ప్రమాదం ముంచుకొచ్చినట్లు గగ్గోలు పెడుతు న్నారన్నారు. ఆయన వద్ద నోట్లు-వెన్నుపోట్లు అనే రెండే అస్త్రాలున్నాయి, అంతటి అవినీతిపరుడు, స్వార్థపరుడు మరెవరూ ఉండరని స్వయంగా ఎన్టీఆర్ చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
నామినేటెడ్ ఎమ్మె ల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన గొంతు నీదా కాదా, బేరసారాలకు రేవంత్‌రెడ్డిని పంపావా లేదా, ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంతో నీకు సంబంధం ఉందా లేదా...ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8, గవర్నర్‌కు అధికారాలు అంటూ వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయమంటూ మొట్టమొదట లేఖ ఇచ్చిన బాబు ఇప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రుల భద్రతకు ముప్పు తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్దోషి అయితే సీబీఐ విచారణ కోరాలని, రాజీనామా చేసి చట్టానికి లొంగిపోవాలని ఆర్కే సూచించారు. గవర్నర్ స్పందించి శాసనసభను రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించాలని ఆర్కే డిమాండ్ చేశారు.
నోట్లు-వెన్నుపోట్లు...ఇవే బాబు అస్త్రాలు
Published Fri, Jun 12 2015 1:02 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement