
సాక్షి, విజయవాడ: పరిపాలనలో సమూల మార్పులు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 46వ డివిజన్‌లో బియ్యం కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డివిజన్లల్లో 65 వేల బియ్యం కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. సచివాలయాలు నూతన పరిపాలనకు వేదికగా నిలిచాయని చెప్పారు. ‘‘జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు అరాచక పాలన సాగించారని.. లంచం ఇస్తేనే పని అనే రీతిలో కమిటీలు పనిచేశాయని’’ విమర్శించారు. సచివాలయాల ద్వారా 72 గంటల్లోనే అర్జీదారుల సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. బియ్యం కార్డుల ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తామని ఆయన తెలిపారు.
బహిరంగ చర్చకు సిద్ధమా..?
తొమ్మిది నెలల పాలనలో ఏదో ఘోరాలు జరిగినట్టు టీడీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారని.. వారు బహిరంగ చర్చకు సిద్ధమా...? అంటూ ఎమ్మెల్యే విష్ణు సవాల్ విసిరారు. టీడీపీ నేతలు నియోజకవర్గంలో 400 కోట్లు అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారని.. అభివృద్ధి కేవలం కాగితాలకే పరిమితమయిందన్నారు. బీసీల పట్ల ప్రేమ అంటూనే టీడీపీ నేతలు కోర్టుకు వెళ్తున్నారని ఆయన దుయ్యబట్టారు. నవరత్నాల అమలుకు టీడీపీ అడ్డుపడుతోందని మండిపడ్డారు. ఇంగ్లీషు మీడియం, పెన్షన్ డోర్ డెలివరీ, బీసీ డిక్లరేషన్, వికేంద్రీకరణ అన్ని అంశాలలో అడ్డు పడుతున్నారని విష్ణు ధ్వజమెత్తారు. (మేమంటే నీకంత ద్వేషమా.. బాబూ?)
సచివాలయాల ద్వారా సంక్షేమ ఫలాలు..
నియోజకవర్గంలో 105 సచివాలయాల ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని.. 35 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. తొమ్మిది నెలల్లో చేసిన సంక్షేమ పాలనను గడప గడప కు తిరిగి ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. జూన్ నెల నుంచి బడి పిల్లలకు ‘జగనన్న కిట్లు’ ఇవ్వనున్నట్లు తెలిపారు. పేదలు చదువుకోవాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment