రూ.17.44 కోట్లు చెల్లించిన వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే
హైదరాబాద్: సదావర్తి భూముల వేలం వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసి విజయం సాధించిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూ ఎండోమెంట్ శాఖకు నేడు రెండో విడత నగదు జమచేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఇటీవల రూ.10 కోట్లను చెల్లించిన ఎమ్మెల్యే ఆర్కే, శుక్రవారం రూ.17.44 కోట్లను ఎండోమెంట్ శాఖకు చెల్లించారు. ఈ భూముల వ్యవహారానికి సంబంధించి హైకోర్టు తీర్పును శిరసావహిస్తామని చెప్పిన ఆర్కే.. అదే ప్రకారం రెండు విడతల్లో పూర్తిస్థాయి నగదు రూ.27.44 కోట్లను దేవాదాయశాఖ ఖాతాకు జమచేశారు.
ఎంతో విలువైన సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీడీపీ నేతలకు కేవలం రూ.22 కోట్లకు ధారాదత్తం చేసింది. భూములను చవకగా కొట్టేసేందుకు తమ సన్నిహితులకు ఏపీ ప్రభుత్వం అప్పగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టును ఆశ్రయించారు. రూ. 22 కోట్లకు అదనంగా మరో రూ.5 కోట్లు ఇస్తే మీకే భూములు ఇస్తామని హైకోర్టు పేర్కొంది. మొత్తం రూ.27.44 కోట్లు చెల్లించేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టుకు నివేదించగా.. మొదటి విడత కింద రూ.10 కోట్లు రెండు వారాల్లో చెల్లించాలని, మిగిలిన రూ.17.44 కోట్లను ఆ తర్వాతి రెండు వారాల్లో చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. ఇటీవల మొదటి విడత నగదు రూ.10 కోట్లను చెల్లించిన ఎమ్మెల్యే ఆర్కే.. నేడు రెండో విడత సొమ్ము రూ.17.44 కోట్లను దేవాదాయశాఖకు చెల్లించారు.