రూ. 10 కోట్లు చెల్లించేందుకు సిద్ధం
హైకోర్టుకు తెలిపిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
దేవాదాయ శాఖ కమిషనర్ కమిషన్ పేరు మీద చెల్లించమన్న కోర్టు
సదావర్తి సత్రం భూముల వ్యవహారంపై తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా
హైదరాబాద్: సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల మేరకు రూ. 10 కోట్లు చెల్లించేందుకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అంగీకరించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్ పేరు మీద ఈ మొత్తాన్ని చెల్లించాలని రామకృష్ణారెడ్డికి కోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ఈ వారంతంలోపే రూ. 10 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని కోర్టు వెలుపల ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో చెప్పారు.
గతవారం ఈ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల భూమిని కొంత మంది పెద్దలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 22 కోట్లకు ధారాదత్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టును ఆశ్రయించారు. రూ. 22 కోట్లకు అదనంగా మరో రూ. 5 కోట్లు ఇస్తే మీకే భూములు కేటాయిస్తామని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అదనంగా చెల్లించాల్సిన రూ. 5 కోట్లతో కలిపి మొత్తం రూ.27.44 కోట్లు చెల్లించేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టుకు నివేదించారు. అలా అయితే మొదటి విడత కింద రూ. 10 కోట్లను రెండు వారాల్లో చెల్లించాలని, మిగిలిన రూ.17.44 కోట్లను ఆ తర్వాతి రెండు వారాల్లో చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మొదటి విడతగా రూ.10 కోట్లు చెల్లించేందుకు ఎమ్మెల్యే ఆర్కే సిద్ధమయ్యారు.