అవి సత్రం భూములేనని, అయితే ఆ సత్రం పేరిట పట్టా ఇవ్వలేదని కాంచీపురం డీఆర్‌వో తమిళనాడు రెవెన్యూ శాఖ కార్యదర్శికి 2010లో రాసిన లేఖ, హక్కు ఉన్నప్పటికీ పట్టా కూడా లేకుండా సత్రం భూములు 471.76 ఎకరాలు విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపిన పత్రం
సాక్షి, అమరావతి: సదావర్తి భూములను కారుచౌకగా కొట్టేయాలని ఎత్తుగడ వేసిన ప్రభుత్వ పెద్దలకు సుప్రీంకోర్టులో ఊహించని పెద్ద దెబ్బే తగిలింది. రిజిస్ట్రేషన్ శాఖ ధర ప్రకారమే ఎకరా ఆరేడు కోట్ల రూపాయలు పలికే 83.11 ఎకరాల భూమిని రూ.22.44 కోట్లకో, లేదంటే రూ.60.30 కోట్లకో కొట్టేదామనుకున్న వారి ఎత్తులన్నింటికీ సుప్రీంకోర్టు అడ్డుకట్టవేసింది. ఇది ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది.
తమిళనాడు లేఖలో స్పష్టంగా...
అవి సదావర్తి సత్రం భూములేనని, కాకపోతే ఆ భూములకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఇంతవరకు సత్రం పేరిట పట్టా ఇవ్వలేదని 2010లో ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇలా ఆ భూములు మన రాష్ట్రానివే అని చెప్పే ఆధారాలను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులే ఇచ్చారు. మామూలుగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ఆధారాల ద్వారా రాజకీయ దౌత్యం, లేదంటే న్యాయపరంగా పోరాడి ముందు ఆ భూములకు పట్టా సంపాదించి అమ్మకం ప్రక్రియకు పూనుకునేది. కానీ అలా జరగలేదు. ప్రభుత్వం అధికారం చేపట్టీ చేపట్టగానే అధికార పార్టీకి చెందిన పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాయడం, పట్టా కూడా లేని ఆ భూముల అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా అనుమతి తెలపడం చకచకా జరిగిపోయాయి. ఇక్కడి నుంచే భూ దోపిడీ కథ మొదలైంది.
కథ కంచికి.. మళ్లీ మొదటికి!
భూములు అక్రమణలో ఉన్నాయని దాదాపు రూ.1000 కోట్ల ధర పలికే సత్రం భూములను మొదట విడత రూ.22.44 కోట్లకే అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలను ‘సాక్షి’ సాక్ష్యాధారాలతో వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. ఈ విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును కోర్టును ఆశ్రయించడంతో భూములకు రెండో విడత వేలం నిర్వహించాలని ఆదేశించింది. మొదట విడత వేలం సందర్భంగా పేర్కొన్న టెండరు నిబంధనలను మార్చారు. మొదటి టెండరు నోటిఫికేషన్‌లో భూములకు రిజిస్ట్రేషన్ చేస్తామన్న నిబంధనను రెండో టెండరు నోటిఫికేషన్‌లో ఎలాంటి రిజిసేŠట్రషన్ చేసేది లేదంటూ స్పష్టంగా పేర్కొన్నారు.
అయినా తొలి విడత వేలం జరిగినప్పుడు ఆ భూములకు పలికిన రూ. 22.44 కోట్ల ధర రెండో విడత వేలంలో ఏకంగా మూడింతలు అధికంగా రూ.60.30 కోట్లకు ఎగబాకడంపై సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఆ భూములకు ఇప్పటి వరకు పట్టా కూడా ఇవ్వలేదన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఈ భూముల అమ్మకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో వేలం పాడాలని, దేవాదాయ శాఖకు డబ్బులు చెల్లించిన వారికి ఆ మొత్తం వడ్డీతో సహా చెల్లించాలని, దీంతోపాటు అసలు ఈ భూములు ఎవరివో ముందు తేల్చాలని సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టును ఆదేశించింది. ఇలా సత్రం భూముల అమ్మకం మొదటికొచ్చింది.
పట్టా తీసుకుని వేలం నిర్వహిస్తే..
చెన్నై నగర సమీపంలో తాళంబూరు గ్రామంలో ఉన్న భూములు సదావర్తి సత్రానివే అనడానికి రాష్ట్ర దేవాదాయ శాఖ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయి. 1927 వరకు ఆ భూములకు అక్కడి రైతులు సదావర్తి సత్రానికి కౌలు చెల్లించిన రికార్డులు దేవాదాయ శాఖ అధికారుల వద్ద ఉన్నాయి. దీనికి తోడు ఆ భూములు సత్రానికి చెందుతాయన్న స్పష్టమైన ఆధారాలను 1924 జనవరి 31వ తేదీ తమిళనాడులోని చెంగలపట్టు కోర్టు డిక్రీ వెలవరించిన పత్రాలు మన రాష్ట్ర దేవాదాయశాఖ వద్ద ఉన్నాయి. ఆ భూములు సత్రానికే చెందుతాయని కాంచీపురం జిల్లా రెవెన్యూ అధికారి 2010 మే 31న ఆ రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శికి రాసిన లేఖ మన రాషŠట్ర అధికారుల వద్ద ఉంది. ‘మన ప్రభుత్వం వద్ద ఉన్న ఆధారాల ఆధారంగా న్యాయపోరాటం చేయవచ్చు. తద్వారా సదావర్తి సత్రం పేరిట అధికారికంగా రికార్డులను పొందవచ్చు. తద్వారా 471.76 ఎకరాల భూములకు రాష్ట్ర ప్రభుత్వం పట్టా సంపాదించవచ్చు. అదే జరిగితే ఈ భూముల ద్వారా సత్రానికి ఏకంగా వేల కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది’ అని దేవాదాయ శాఖ అధికారులే చెబుతున్నారు.
చంద్రబాబు దోపిడీకి అడ్డుకట్ట: ఆళ్ల
అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని పేద బ్రాహ్మణులకు చెందాల్సిన అత్యంత విలువైన భూమిని తమ పార్టీ అనుయాయుల ద్వారా నామమాత్రపు ధరకు కొట్టేయాలనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దోపిడీని అడ్డుకోగలిగామని వైఎస్సాఆర్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. వాదనల సమయంలో న్యాయస్థానాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలే ఇందుకు సాక్షాత్కారాలని గుర్తుచేశారు. రాజా వాసిరెడ్డి వారసులు 1885లో రాసిన వీలునామా ప్రకారం చెన్నై నగరం సమీపంలోని తాళంబూరు, పరిసరాల్లో 471.76 ఎకరాలు సదావర్తి సత్రానికి చెందినవని అన్నారు. ఆక్రమణలకు గురయ్యాయని అంటూ 83.11 ఎకరాలను వేలం పేరిట అక్రమ మార్గాల్లో దక్కించుకునేందుకు చంద్రబాబు అనేక ఎత్తులు వేశారన్నారు. విధివిధానాల ప్రకారం కాకుండా చీకటి గదిలో వ్యవహారాల తరహాలో వేలం నిర్వహణ తీరును, ఇతర అంశాలన్నింటినీ న్యాయస్థానాల దృష్టికి సాక్ష్యాలతో సహా తీసుకెళ్లగలిగామన్నారు. ప్రభుత్వ అధికారుల సమాచారం మేరకే అక్కడ ఎకరం రూ.6.50 కోట్ల వరకు ధర ఉండగా 83.11 ఎకరాలను 22.44 కోట్లకు తన అనుయాయుల ద్వారా దక్కించుకునేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగడలు పారలేదన్నారు. న్యాయస్థానం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే విశ్వాసం ఉందని, అప్పటివరకు తమ పోరాటం కొనసాగుతుందని, పేద బ్రాహ్మణులకు సత్రం భూముల ఫలాలు అందాలనేది ఆకాంక్ష అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment