ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, వై.విశ్వేశ్వర్రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, వై.విశ్వేశ్వర్రెడ్డి గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు.
గత తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు ఇదే విధంగా ఛార్జీలు పెంచారని ఎమ్మెల్యేలు గుర్తుకు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒక్క రూపాయి విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు గుదిబండగా మారుతున్నాయన్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సహకాలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.