తెలుగు తమ్ముళ్ల దాష్టీకం..
బొల్లాపల్లి(మార్టూరు): తెలుగు తమ్ముళ్లు మరోమారు తమ దాష్టీకాన్ని ప్రదర్శించారు. సాగునీటి కోసం జిల్లా రైతులు పడుతున్న ఇబ్బందులపై అసెంబ్లీలో పదేపదే వివరించడంతో పాటు, పంటలు ఎండిపోకుండా నీరివ్వాలని రైతుల తరఫున పోరాటం చేసిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్‌లతో దురుసుగా ప్రవర్తించారు. మార్టూరు మండలం బొల్లాపల్లి వద్ద ఎన్‌ఎస్‌పీ కాల్వను పరిశీలించేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వస్తున్నారని తెలిసి ఎమ్మెల్యేలు కాల్వ వద్దకు చేరుకున్నారు.
మంత్రికి దగ్గరుండి కాల్వల లైనింగ్ పనులు జరుగుతున్న తీరు, రైతులు పడుతున్న బాధలు, సాగునీటి విషయంలో జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలనుకున్నారు. మంత్రి రావడం ఆలస్యం కావడంతో అక్కడే రెండు గంటలకుపైగా వేచి ఉన్నారు. మంత్రి ఉమామహేశ్వరరావు, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కార్యాలయం నుంచి బయలుదేరి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కాల్వ వద్దకు వచ్చారు.
రోడ్డు వెంట వేచి ఉన్న ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్‌లను చూసిన మంత్రి కారుదిగి వారు ఇచ్చిన మెమొరాండం తీసుకుంటున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో అక్కడే ఉన్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు, వారికి మధ్య వాగ్వాదం, స్వల్ప తోపులాట జరిగింది.
ఉద్రిక్త వాతావరణం నెలకొని, పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఇంత జరుగుతున్నా మంత్రి వారించకుండా, ఎమ్మెల్యేలను పట్టించుకోకుండా కరణం బలరాం, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో కలిసి కారులో ఎక్కి సాగర్ కాల్వపై పర్యటనకు వెళ్లారు. ప్రభుత్వానికి ప్రజల సమస్యలు వినిపించుకునే తీరిక కూడా లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు అక్కడి నుంచి జొన్నతాళి చేరుకున్నారు.
వారితో పాటు వైఎస్సార్ సీపీ రైతు సంఘ నాయకులు వణుకూరి సుబ్బారెడ్డి, నార్నె సింగారావు, గొట్టిపాటి నరసింహారావు, జిల్లా మాజీ డెయిరీ చైర్మన్ ఉప్పలపాటి చెంగలయ్య, దొడ్డా బ్రహ్మానందం, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు తాటి వెంకట్రావు, మార్టూరు, బల్లికురవ, పంగులూరు, కొరిశపాడు, యద్దనపూడి మండలాలకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు. చీరాల డీఎస్‌పీ జయరామరాజు, ఇంకొల్లు సీఐ శ్రీనివాసరావు, మార్టూరు ఎస్సై అజయ్‌కుమార్ తమ సిబ్బందితో బందోబస్తు విధులు నిర్వహించారు.
సాగర్‌కు నీరు రావడం లేదని గోడు వెళ్లబోసుకున్న రైతులు:
బొల్లాపల్లి సాగర్ కాల్వ వద్దకు చేరుకున్న రైతులు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బొల్లాపల్లి కాల్వ వద్దకు 792 క్యూసెక్కులు రావాలని, అయితే ఇప్పటి వరకు 100, 120 క్యూసెక్కులు మాత్రమే నీళ్లు వస్తున్నాయన్నారు. అధికారులు కూడా పంటలు ఎండుతున్నాయని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. మంత్రి వస్తున్నారని ఇవాళ 305 క్యూసెక్కులు వదిలారన్నారు. మంత్రి పోయిన తర్వాత నీరు రాదని ఆవేదన వ్యక్తం చేశారు.