మ్యానిఫెస్టో చూపిస్తే.. ఎమ్మెల్యేలను ఉసిగొల్పుతారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, ముత్యాలనాయడు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి గురువారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. టీడీపీ మ్యానిఫెస్టోను చూపించి చంద్రబాబును ప్రశ్నిస్తే... ఎమ్మెల్యేలను ఉసిగొల్పుతారా అని కొడాలి నాని ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలే తప్ప... టీడీపీ నేతగా వ్యవహరించవద్దని తాము స్పీకర్ను కోరామని తెలిపారు. రౌడీల్లాగా బెదిరిస్తే సభలో నెగ్గొచ్చనుకోవడం మూర్ఖత్వం అవుతుందని అన్నారు.
అలాగే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విస్మరించి, ప్రజలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని ఆయన ఆరోపించారు. మీ తప్పులను లెక్కలతో సహా చూపిస్తే మైక్లు కట్ చేస్తారా ? అని ప్రశ్నించారు. ఓ ప్రతిపక్ష నేతను 'యు కాంట్ టాక్' అని స్పీకర్ అనడం చట్టసభల్లో ఎక్కడా చూడలేదన్నారు. రాష్ట్రంలో ఉన్నది ఒకే ప్రతిపక్షం... దాని గొంతు కూడా నలిపేసి సభను ఎలా నడుపుతారు అన్నారు.
మరో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ముత్యాలనాయుడు మాట్లాడుతూ... సభ్యులను భయపెట్టి, భయభ్రాంతులను చేసి సభను నడిపించాలనుకోవడం అర్థరహితమన్నారు. గ్రామాల్లో తిరగనీయబోమంటూ బెదిరించడం టీడీపీ నేతలను తగదని ఆయన అభిప్రాయపడ్డారు.