
సాక్షి, మచిలీపట్నం : బందరు పోర్టు త్వరితగతిన పూర్తి కావాలన్నా, ప్రజా సమస్యలు పరిష్కారం లభించాలన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావల్సిందేనని జనమంతా భావిస్తున్నారని వైఎస్ఆర్సీపి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి స్పష్టం చేశారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. మచిలీపట్నంలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని నాని తో కలిసి పలు వార్డుల్లో రోడ్ షో తో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సమస్య, పారిశుద్ధ్య లోపంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చంద్రబాబు నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
ఎన్నికలప్పుడే చంద్రబాబుకు ప్రజలు గుర్తోస్తారని, డబ్బులు పంచి ఓట్లను కొనుగోలు చేసి రాజకీయంగా లబ్ధి పొందిన తర్వాత ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో పోలీసుల ద్వారా ఓటర్లకు డబ్బులు పంచి లబ్ది పొందేందుకే ఇంటలిజెన్స్ డిజి వెంకటేశ్వరరావు బదిలీని రాజకీయం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలంతా గట్టి గుణపాఠం చెప్పేందుకు కంకణబద్దులై ఉన్నారని తెలిపారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే బందరు పోర్టు ను పూర్తి చేసి స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. కృష్ణాడెల్టాకు రెండు పంటలకు సాగునీరు, అన్ని గ్రామాలకు తాగునీరు అందించడంతో పాటు ప్రత్యేక హోదా సాధించి తీరుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment