
విజయవాడ: ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యవహార శైలిని బాపట్ల వైఎస్సార్ సీపీ ఎంపీ నందిగం సురేశ్ తప్పుబట్టారు. మాదిగల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. విజయవాడ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఎంపీ నందిగం సురేశ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మాదిగలు బాగుపడే ఉద్దేశం మందకృష్ణకు లేదని ధ్వజమెత్తారు. హడావుడిగా ఏపీకి వచ్చి అల్టిమేటం ఇస్తున్నారని విమర్శించారు. ఎస్సీ దళితులపై ప్రేమ కనిపించడం లేదన్నారు. ఎస్సీల సంక్షేమాన్ని అడ్డుకోవడమే ధ్యేయంగా అడ్డంకులు కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి ఎన్నడూ లేని విధంగా మాదిగలకు ఒక కార్పొరేషన్, రెండు మంత్రి పదవులు ఇచ్చారన్నారని తెలిపారు. సామాజిక న్యాయపరంగా ఆయన ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఎమ్మార్పీఎస్ వల్ల లబ్ధి పొందింది టీడీపీనే అని, సీఎం జగన్ పాలనలో మాదిగలు అభివృద్ధి చెందుతారన్న భయం మందకృష్ణలో కనిపిస్తోందన్నారు. ఒక వ్యూహం ప్రకారమే మందకృష్ణ ఆందోళన చేస్తున్నారని, దీని వెనుక చంద్రబాబు ఉన్నారని ఎంపీ ఆరోపించారు. వైఎస్ జగన్ పాలనను పొగిడి...ఇప్పుడు విమర్శించడంలో ఆంతర్యమేంటని సూటిగా ప్రశ్నించారు. మందకృష్ణ ప్రకటించిన ధర్నా, ఆందోళనలు విరమించుకోవాలని, ప్రజలను రెచ్చగొట్టే ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు.