కొత్తపల్లి ఎంపీపీ పీఠం వైఎస్సార్‌సీపీదే
ఆత్మకూరు/కొత్తపల్లి: కర్నూలు జిల్లా కొత్తపల్లి మండల ఎంపీపీ పీఠం ఎట్టకేలకు వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 4న ఎంపీపీ ఎన్నికలు నిర్వహించగా.. కొత్తపల్లి మండలంలో సభ్యులు హాజరు కాకపోవడంతో వాయిదా వేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి శోభారాణి ఆధ్వర్యంలో తిరిగి ఎన్నిక నిర్వహించారు. మొత్తం 9 ఎంపీటీసీ స్థానాల్లో ఆరు వైఎస్‌ఆర్‌సీపీ, మూడు టీడీపీ కైవసం చేసుకున్నాయి. మొదట కో ఆప్షన్ సభ్యుడి ఎంపిక చేపట్టగా.. వైఎస్‌ఆర్‌సీపీ తరఫున ముసలమడుగు గ్రామానికి చెందిన మూసా కరిముల్లాతో నామినేషన్ వేయించారు.
టీడీపీ తరఫున ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎంపికైనట్లు అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం ఎంపీపీ సమావేశ హాలులో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ ఎంపీటీసీలచే ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీ ఎన్నిక ప్రారంభమైంది. దుద్యాల ఎంపీటీసీ-2 స్థానంలో గెలుపొందిన సావిత్రమ్మను వైఎస్‌ఆర్‌సీపీ తరఫున ప్రతిపాదించగా గువ్వలకుంట్ల ఎంపీటీసీ సభ్యురాలు రవణమ్మ బలపర్చారు. వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన 8 మంది ఎంపీటీసీ సభ్యులు ఆమెకు మద్దతుగా చేతులు ఎత్తడంతో సావిత్రమ్మ ఎంపీపీగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించి ప్రమాణస్వీకారం చేయించారు. వైస్ ఎంపీపీగా ఎర్రమఠం ఎంపీటీసీ సభ్యుడు ఎస్.మహబూబ్‌బాషా ఎన్నికయ్యారు. డీఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటైంది.
ఫలించిన ఎమ్మెల్యే వ్యూహం- టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డికి చుక్కెదురు
నందికొట్కూరు: కొత్తపల్లి ఎంపీపీ పీఠం వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకునేందుకు ఎమ్మెల్యే ఐజయ్య రచించిన వ్యూహం ఫలించింది. మండలంలోని తొమ్మిది ఎంపీటీసీ స్థానాల్లో ఆరింటిని వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. అయితే ఇటీవల వైఎస్‌ఆర్‌సీపీని వీడి టీడీపీలో చేరిన మాండ శివానందరెడ్డి కొత్తపల్లి మండల ఎంపీపీ పీఠం ఆ పార్టీ ఖాతాలో జమ చేసేందుకు సర్వశక్తులు ఒడ్డారు. ఆయన ఎత్తులను ఎమ్మెల్యే ఐజయ్య చిత్తు చేశారు. ఎంపీపీ పీఠం విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తనదైన శైలిలో తెరదించారు. టీడీపీ శ్రేణులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎంపీటీసీ సభ్యులు తాము వైఎస్‌ఆర్‌సీపీని వీడేది లేదని తేల్చి చెప్పడం విశేషం.