హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించనందుకు నిరసనగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకుల ఆందోళనలు మిన్నంటాయి.
అనంతపురం: అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నేతృత్వంలో స్థానిక వినాయక సర్కిల్‌లో పార్టీ శ్రేణులు మోదీ, చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశాయి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కల్యాణదుర్గంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మోహనరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కదిరిలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అత్తర్‌చాంద్ బాషా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. అంబేద్కర్ సర్కిల్, ఇందిరాగాంధీ సర్కిల్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు.
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు భారీ ఎత్తున నిర్వహించారు. ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, ఎమ్మెల్యేలు సునీల్, అమరనాథ్‌రెడ్డి ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ చేశారు. అనంతరం ఏటీఎం సర్కిల్ వద్ద చెన్నై-బెంగళూరు జాతీయరహదారిపై రాస్తారోకోకు దిగారు.
నెల్లూరు: వెంకటాచలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు వినూత్న నిరసనలు చేపట్టారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మట్టి కుండలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కావలిలో ఎమ్మెల్యే ప్రతాప్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ నల్లబాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
చోడవరం: విశాఖ జిల్లా చోడవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. పార్టీ చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో కార్యకర్తలు శుక్రవారం మోదీ, చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం చోడవరం- భీమిలి రహదారిపై రాస్తారోకో, మాన వహారం చేపట్టి, తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
కమలాపురం: వైఎస్సార్ జిల్లా కమలాపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఆంధ్రాకు వెంటనే ప్రత్యేకహోదా కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఉత్తమ రెడ్డి, స్థానిక తహశీల్దార్కు వినతిపత్రం సమర్పించారు.
గుంటూరు: గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. నర్సరావుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. గుంటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ నేత అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టింది. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట వినూత్న నిరసనలకు దిగారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.