వైఎస్ఆర్ సీపీ బహిరంగ సభ పోస్టర్ విడుదల
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ మరోమారు తన గళం విప్పనుంది. రాష్ట్ర విభజనతో అన్ని విధాలా దారుణంగా నష్టపోయిన ఏపీ సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక హోదా కల్పించడం ఒక్కటే పరిష్కారమని ఆ పార్టీ నవంబర్ 6న విశాఖపట్నంలో ‘జై ఆంధ్రప్రదేశ్’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఈ బహిరంగ సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను వైఎస్ఆర్ సీపీ నేతలు సోమవారం పార్టీ కేంద్ర కార్యలయంలో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెండున్నరేళ్లుగా చంద్రబాబు సర్కార్ ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పోరాటం ఆగదని, టీడీపీ సర్కార్ దగాను ఎండగట్టేందుకే బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం అయిదుచోట్ల బహిరంగ సభలు నిర్వహించి, ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరిస్తామని ఉమ్మారెడ్డి తెలిపారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేలా ప్రజాభిప్రాయాలను తెలియచేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయ సాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, వాసిరెడ్డి పద్మ, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.