
అదే గురి...అదే స్ఫూర్తి
సాక్షి, రాజమండ్రి :‘విలువలు, విశ్వసనీయత, నిబద్ధత, సమర్థత కలబోసిన విలక్షణనేత మాకున్నారని చెప్పుకొనేందుకు ఎంతో ఆనందంగా ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలమనిచెప్పుకోవడానికి గర్వంగా ఉంది. గత నాలుగున్నరేళ్లుగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మీతో పాటు మేము కూడా ఎన్నో కష్టాలను ఎదు ర్కొన్నాం. అధికారంలోకి రాలేనందుకు బాధగా ఉన్నా మరో ఐదేళ్లు కూడా మీకు అండగా నిలిచేందుకు ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటాం’ చెక్కు చెదరని ఆత్మవిశ్వా సంతో కార్యకర్తలు అన్న ఈ మాటలు.. వైఎస్సార్ సీపీ శ్రేణుల మనోనిబ్బరానికి, సమరోత్సాహానికి అద్దం పట్టాయి. ‘ఓటమి చెందిన కొద్దిరోజుల్లోనే పార్టీ అధినేత ఇలా మా వద్దకు వచ్చి మాతో మాట్లాడుతున్నారంటే నమ్మలేకపోతున్నాం. భవిష్యత్‌లో కూడా ఇలాగే నాయకులు, కార్యకర్తలతో మమేకమవుతూ అండగా ఉంటే పార్టీని విజయతీరాలకు చేరుస్తాం’ అని వారంటున్నప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సైతం ఉద్వేగానికి లోనయ్యారు.
‘తప్పనిసరిగా ప్రతి కార్యకర్తకూ నేను అండగా ఉంటాను. పార్టీ యంత్రాంగమంతా మీవెంటే ఉంటుంది. అధైర్యపడొద్దు’ అని వారి నిబ్బరాన్ని ఇబ్బడిముబ్బడి చేశారు. ఉత్తరాం ధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై రాజమండ్రి ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ వేదికగా చేపట్టిన సమీక్షలు రెండో రోజైన గురువారం కొనసాగాయి. ఉదయం 10గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ సమీక్షలు కొనసాగాయి. ఉద యం అరకు, మధ్యాహ్నం విజయనగరం, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమీక్షించారు. గ్రామ, బూత్‌స్థాయి వరకు పార్టీ బలోపేతానికి తీసుకోవల్సిన చర్యల పై వారి సూచనలు, సలహాలు తెలుసుకున్నారు. తమ సమస్యలను, క్షేత్రస్థాయిలో లోటుపాట్లను చెప్పేందుకు కార్యకర్తలు పోటీపడ్డారు.
గురువారం సమీక్షలు ఎక్కువగా పార్టీ గెలుపొందిన అసెంబ్లీ నియోజకవర్గాలపైనే జరి గాయి. ఒకవైపు మోడీ ప్రభావం, మరోవైపు చంద్రబాబు రుణమాఫీ హామీని తట్టుకొని విజ యం సాధించిన ఎంపీ, ఎమ్మెల్యేలను అభినందిస్తూ, వారిని గెలిపించిన ప్రజలకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. అరకు, విజయనగరం పార్లమెంటు నియోజక వర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు అమలాపురం పార్లమెంటు నియోజకవర్గపరిధిలోని కొత్తపేట, రామచంద్రపురం, మండపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపోటములపై నాయకులు, కార్యకర్తలతో జగన్ సమీక్షించారు. పార్టీని బూత్‌స్థాయి వరకు బలోపేతం చేస్తామని, గ్రామ కమిటీలను వేయడమే కాక అవి నిరంతరం పని చేసేలా అవసరమైన శిక్షణ ఇస్తామని జగన్ చెప్పారు.
వెల్లువెత్తుతున్న పార్టీ శ్రేణులు
ఎన్నికల అనంతరం తొలిసారి జిల్లాకు వచ్చిన జగన్‌ను చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వస్తుండడంతో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ప్రాంతం కిక్కిరిసిపోతోంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3.15 వరకు, భోజన విరామం అనంతరం తిరిగి ప్రారంభమైన సమీక్షలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. ప్రతి కార్యకర్తనూ పేరుపేరునా పలకరిస్తున్న జగన్.. వారి ప్రతి సలహా, సూచనలను నోట్ చేసుకుంటూ వారితో మమేకమవుతున్న తీరు పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతోంది. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు నిర్మాణాత్మక సూచనలు చేస్తున్నారు. గ్రామ కమిటీలను బలోపేతం చేయడంతోపాటు రాష్ర్ట, జిల్లా స్థాయిల్లో లీగల్ సెల్స్ ఏర్పాటు చేసి అధికార పార్టీ వేధింపులు, అక్రమ కేసులను ఎదుర్కొనాలని సూచించారు. ఎక్కడ, ఏ కార్యకర్తకు ఏ చిన్న కష్టమొచ్చినా స్థానిక నేతలతో పాటు జిల్లా మొత్తం ఆ కార్యకర్త ఉండే గ్రామానికే వెళ్లి అతనికి అండగా ఉండాలంటూ ప్రజాప్రతినిధులు, జిల్లా, నియోజకవర్గ నాయకులకు జగన్ మార్గనిర్దేశం చేయడం కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపుతోంది. అవసరమైతే తాను కూడా అండగా నిలిచేందుకు వస్తాననడం వారికి వెయ్యేనుగుల బలాన్నిస్తోంది.
ఇక బాబు పని పడతాం..
సమీక్ష సందర్భంగా జగన్ చేస్తున్న ప్రసంగాలు పార్టీలో కొత్త జోష్‌ను నింపుతున్నాయి. ‘అబద్ధపు హామీలతో అధికారం చేపడుతున్న చంద్రబాబు చేయనున్న మోసాలు మరో 15 రోజుల్లోనే బట్టబయలవుతాయని, ఆయన్ని కంటికి రెప్పలా కాచేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 వంటి మీడియా సంస్థలు పనిచేస్తాయని, అందువలన ప్రతి కార్యకర్తా ఓ సైన్యంలా బాబు మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని జగన్’ అన్నప్పుడు కార్యకర్తలు ‘ఇక బాబు పనిపడతాం’ అంటూ నినదిస్తున్నారు. రాష్ర్టంలో బలీయమైన శక్తిగా వైఎస్సార్ సీపీ ఆవిర్భవించిందని, త్వరలోనే అధికారంలోకి కూడా వస్తుందని అంటూ జగన్ వారిలో ఉత్తేజాన్ని నింపారు.సమీక్షా సమావేశాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్యేలుగా గెలుపొం దిన జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, పినిపే విశ్వరూప్, మహిళా విభాగం రాష్ర్ట అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి,
సీఈసీ సభ్యుడు రెడ్డి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, అల్లూరి కృష్ణం రాజు, రౌతు సూర్యప్రకాశరావు, కో ఆర్డినేటర్లు గిరజాల వెంకటస్వామినాయుడు, ఆకుల వీర్రా జు, చెల్లుబోయిన వేణు, గుత్తుల సాయి, బొంతు రాజేశ్వరరావు, రాష్ర్ట సేవాదళ్, యూత్ కమిటీ సభ్యులు సుంకర చిన్ని, తాడి విజయ భాస్కరరెడ్డి, వాసిరెడ్డి జమీలు, అనుబంధ కమిటీల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, అనంత ఉదయభాస్కర్, మంతెన రవిరాజు, డాక్టర్ యనమదల మురళీకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు, మార్గన గం గాధర్, రెడ్డి రాధాకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, గొల్లపల్లి డేవిడ్‌రాజు, పార్టీ నాయకులు జక్కంపూడి రాజా, జ్యోతుల నవీన్‌కుమార్, కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి, బసవా చినబాబు, జున్నూ రి బాబి, ముత్యాల వీరభద్రరావు, సిరిపురపు శ్రీనివాసరావు, వట్టికూటి రాజశేఖర్, నక్కా రాజ బాబు, మిండగుదిటి మోహన్, ఆర్‌వీవీ సత్య నారాయణచౌదరి, యనమదల గీత, చెల్లుబోయిన శ్రీను, యేడిద చక్రం, పాలెపు ధర్మారావు, గుత్తుల మురళీధరరావు, గుర్రం గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.