= సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల రాస్తారోకోలు
= జిల్లా వ్యాప్తంగా అనూహ్య స్పందన
= సమైక్యమే తమ లక్ష్యమన్న జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ
= 363 మంది అరెస్టు, విడుదల
= నేడు కూడా రహదారుల దిగ్బంధం
ఒంగోలు, న్యూస్‌లైన్: రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో బుధవారం రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యూహాత్మకంగా వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గురువారం కూడా రహదారుల దిగ్బంధం చేసి సమైక్యవాదాన్ని చాటిచెబుతామని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ ప్రకటించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులతో పాటు సమైక్య రాష్ట్రం కోరుకునే ప్రతి ఒక్కరూ సమైక్యనాదం వినిపించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాస్తారోకోల సందర్భంగా జిల్లావ్యాప్తంగా 363 మందిని అరెస్టు చేసిన పోలీసులు వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఒంగోలులో నాలుగు దఫాలుగా రహదారులు దిగ్బంధించారు. ఉదయం 8.45 నుంచి 9.45 వరకు గంటపాటు త్రోవగుంట జంక్షన్‌లో రాస్తారోకో నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, రైతు విభాగం జిల్లా కన్వీనర్ మారెడ్డి సుబ్బారెడ్డి, పార్టీ ఒంగోలు మండల కన్వీనర్ రాయపాటి అంకయ్య, నాయకులు సింగరాజు వెంకట్రావు, మండువ సుబ్బారావు తదితరులు జాతీయ రహదారిపై అడ్డంగా బైఠాయించారు. క్షణాల్లోనే పెద్ద ఎత్తున వాహనాలు అన్ని మార్గాల్లో నిలిచిపోయాయి. చివరకు లారీల యజమానులు, ట్రాక్టర్ల యజమానులు కూడా ఈ దిగ్బంధానికి మద్దతు పలికారు. కార్యక్రమం చేపట్టగానే వారు కూడా తమ వాహనాలను రోడ్డుకు అడ్డంగా ఉంచి సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. పోలీసులు అరెస్టు చేస్తామని హెచ్చరించినప్పటికీ నాయకులు మాత్రం పట్టువీడలేదు. దీంతో ఒంగోలు తాలూకా పోలీసులు బలవంతంగా అరెస్టుచేసి 15 మందిపై కేసులు నమోదు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
ఉదయం 10.45 గంటలకు స్థానిక దక్షిణ బైపాస్‌లో రాస్తారోకో చేపట్టారు. పార్టీ జిల్లా కన్వీనర్ బాలాజీ, నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధులు నరాల రమణారెడ్డి, కొఠారి రామచంద్రరావు, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ కేవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూకసాని బాలాజీ మాట్లాడుతూ విభజన అంటూ జరిగితే రాష్ట్రం మొత్తం ఎడారిగా మారిపోతుందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని తెలిసినా కేవలం రాజకీయ స్వార్థంకోసం విడదీయాలనుకోవడం దుర్మార్గమన్నారు. అరెస్టులకు భయపడేదే లేదని, గురువారం కూడా రహదారులను దిగ్బంధం చేస్తామని ప్రకటించారు. ఇక్కడ 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు మహిళా విభాగం ఆధ్వర్యంలో స్థానిక మంగమూరు రోడ్డు జంక్షన్‌లో జాతీయ రహదారిని దిగ్బంధించారు. గంటపాటు జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, నగర కన్వీనర్ కావూరి సుశీల, మహిళా నాయకురాళ్లు బడుగు ఇందిర, రమాదేవి, సుబ్బులు, రాజేశ్వరి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
పోలీసులు 11 మంది మహిళలను అరెస్టు చేశారు. సాయంత్రం 4.15 గంటలకు స్థానిక మంగమ్మ కాలేజీ జంక్షన్‌లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని చీమకుర్తి, సంతనూతలపాడు మండలాలకు చెందిన నాయకులు, జిల్లా యువజన, విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త అంగలకుర్తి రవి, సంతనూతలపాడు, చీమకుర్తి మండలాల కన్వీనర్లు దుంపా చెంచిరెడ్డి, పమిడి వెంకటేశ్వర్లు, దుంపా యలమందారెడ్డి, బాపట్ల వెంకట్రావు, రావులపల్లి కోటేశ్వరరావు, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి, నగర కన్వీనర్ నెరుసుల రాము, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటేశ్వరరావు, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబు, నగర కన్వీనర్ అమర్నాథరెడ్డి, యువజన విభాగం జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. నూకసాని బాలాజీతోపాటు 14 మందిని పోలీసులు అరెస్టుచేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
- మద్దిపాడులో ఉదయం 10.30 నుంచి 11.30 వరకు హైవేపై జరిగిన రాస్తారోకో కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తలు అంగలకుర్తి రవి, డాక్టర్ వరికూటి అమృతపాణి, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల కన్వీనర్లు మండువ అప్పారావు, దివి పున్నారావు తదితరులు పాల్గొన్నారు.
- చీరాలలో వేటపాలెం స్ట్రెయిట్ కట్ వద్ద చీరాల నియోజకవర్గ సమన్వయకర్తలు పాలేటి రామారావు, అవ్వారు ముసలయ్య, యడం చినరోశయ్య, సజ్జాహేమలతతోపాటు ఎన్‌ఆర్‌ఐ విభాగం కార్యదర్శి యడం చినబాలాజీ, చీరాల పట్టణ కన్వీనర్ యాతం ఆనందరావు తదితరులు ఉదయం 10.40 నుంచి 11.40 వరకు జాతీయ రహదారిని దిగ్బంధించారు.
- అద్దంకిలో పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు ఆర్టీసీ బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండు సెంటర్‌లో ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులికం కోటిరెడ్డి, వైస్ చైర్మన్ కే.అంకారావు తదితరులు పాల్గొన్నారు.
- వ్యవసాయ విభాగం రాష్ట్ర నాయకుడు వల్లభురెడ్డి సుబ్బారెడ్డి తదితరులు కలిసి మార్టూరులో జాతీయ రహదారిపై గంటపాటు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
- టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తాటితోటి నరశింగరావు, పలు మండలాల కన్వీనర్లతో కలిసి 10.50 నుంచి 11.40 వరకు రాస్తారోకో చేశారు. అనంతరం టంగుటూరు-కొండపి మార్గంలో రహదారిని దిగ్బంధించారు.
- ఉలవపాడు మండలం రాజుపాలెం వద్ద దాదాపు రెండు గంటలు, గుడ్లూరు మండలం తెట్టు వద్ద గంటపాటు జరిగిన రాస్తారోకోలో కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్తలు తూమాటి మాధవరావు, ఉన్నం వీరాస్వామి పాల్గొన్నారు.
- కనిగిరిలో ఉదయం 5.30 గంటలకే బస్సులను వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దాదాపు 8.30 గంటలపాటు చెక్‌పోస్టు వద్ద బస్సుల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. 11.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పామూరు బస్టాండు వద్ద వాహనాల రాకపోకలను నిలిపేశారు. పట్టణ కన్వీనర్ ఖాదర్‌తోపాటు యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడు వైయం.ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- దర్శిలో తాజా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, మండల కన్వీనర్లు కలిసి గడియారస్తంభం సెంటర్‌లో రాస్తారోకో చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పడుతున్న తపనను ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారని, నాయకులు కూడా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా సమైక్యాంధ్రకు సంఘీభావం ప్రకటించేందుకు కదిలిరావాలని శివప్రసాదరెడ్డి పిలుపునిచ్చారు.
- మార్కాపురంలో నియోజకవర్గ సమన్వయకర్తలు జంకె వెంకటరెడ్డి, వెన్నా హనుమారెడ్డిలు రాస్తారోకో చేపట్టగా మరో నియోజకవర్గ సమన్వయకర్త ఉడుముల శ్రీనివాసరెడ్డి పొదిలిలో రాస్తారోకో చేశారు. పొదిలి పోలీసులు ఉడుముల శ్రీనివాసరెడ్డితోపాటు మరో 50 మందిని అరెస్టు చేశారు.
- గిద్దలూరు బస్టాండు సెంటర్‌లో నియోజకవర్గ సమన్వయకర్తలు ముత్తుముల అశోక్‌రెడ్డి, వై.వెంకటేశ్వరరావు రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర నినాదాలు చేయడంతో పాటు, పెరిగిన ఆర్టీసీ చార్జీలను కూడా నిరశించారు. దాదాపు మూడు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం గిద్దలూరు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీమన్నారాయణకు వినతిపత్రం అందజేశారు. కొమరోలులో చెక్‌పోస్టు వద్ద, బేస్తవారిపేటలో చింతలపాలెం వద్ద, అర్థవీడు మండలం నాగులవరం జంక్షన్ వద్ద జరిగిన రాస్తారోకోల్లో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు పాల్గొన్నారు. - మాచర్ల-వై.పాలెం జాతీయ రహదారిపై పుల్లలచెరువు మండలం మల్లపాలెం వద్ద జరిగిన రాస్తారోకోలో యర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు పాల్గొన్నారు. రెండు గంటల పాటు జరిగిన రాస్తారోకోను పోలీసులు అడ్డుకొని బలవంతంగా డేవిడ్‌రాజుతోపాటు 150 మందిని అరెస్టు చేశారు.
అడుగడుగునా దిగ్బంధం
Published Thu, Nov 7 2013 4:21 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement