కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. | 9 killed in road accident in Kurnool district | Sakshi
Sakshi News home page

కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం..

Published Mon, Jun 25 2018 3:28 AM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

9 killed in road accident in Kurnool district - Sakshi

ప్రమాదానికి గురైన ఆటో.. ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా మృతదేహాలు. ఇన్‌సెట్‌లో ఆటోను ఢీకొట్టిన బస్సు

ఓర్వకల్లు: మెరుగైన కంటి చూపు కోసం పసరు మందు తీసుకుందామని బయల్దేరిన వృద్ధులపై విధి చిన్న చూపు చూసింది. బస్సు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారిని శాశ్వతంగా కబళించింది. కర్నూలు జిల్లా సోమయాజుల పల్లె వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. జిల్లాలోని కల్లపరి, చనుగొండ్ల, రామళ్లకోట గ్రామాలకు చెందిన 60 మంది కంటి చూపు మందగించడంతో పసరు మందు తీసుకుందామని మహానందిలోని నాటు వైద్యుని వద్దకు ఆరు ఆటోల్లో బయల్దేరారు. ఒక్కొక్క ఆటోలో 8 నుంచి 14 మంది వరకు ఎక్కారు. తెల్లవారుజామున 3 గంటలకు వారివారి స్వస్థలాల నుంచి మహానందికి పయనమయ్యారు. కోడుమూరు నుంచి వెల్దుర్తి, రామళ్లకోట మీదుగా కాల్వబుగ్గ సమీపంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద 18వ జాతీయ రహదారిపైకి చేరుకున్నారు.

అక్కడ నంద్యాల వైపునకు మలుపు తిరిగి ఐదు ఆటోలు రాంగ్‌రూట్‌లో ముందుకు వెళ్లిపోయాయి. వాటి వెనకాలే వెళ్తున్న ఏపీ 21 టీసీ 1929 నంబర్‌ గల ఆటోలో 14 మంది ప్రయాణికులున్నారు. సోమయాజులపల్లె పెట్రోలు బంక్‌ వద్దకు వచ్చేసరికి ఈ ఆటోను నంద్యాల వైపు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ డీలక్స్‌ బస్సు(ఏపీ 21 జెడ్‌ 0707) ఢీకొట్టింది. దీంతో ఆటో ఫల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కల్లపరికి చెందిన బొరుసు మారెప్ప(55), గూడూరు ఈరమ్మ(53), సర్పంచ్‌ గౌరమ్మ(54), మాణిక్యమ్మ(52), రామళ్లకోటకు చెందిన హుసేనమ్మ(59), సోమక్క(58), చనుగొండ్లకు చెందిన బోయ నడిమింటి లక్ష్మీదేవి(48) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇంతలో ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు.. క్షతగాత్రులను 108, హైవే పెట్రోలింగ్‌ వాహనాల్లో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కల్లపరికి చెందిన అత్తాకోడళ్లు బోయ నల్లబోతుల లక్ష్మీదేవి, గోవిందమ్మ ప్రాణాలు విడిచారు. తీవ్రగాయాలపాలైన ఆటో డ్రైవర్‌ వాసు, అశోక్, నాగరాజు, సరోజమ్మ, భగవంతులకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన జిల్లా ఏఎస్పీ షేక్షావలి ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. బస్సు డ్రైవర్‌ అతివేగం, ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. కాగా, ఓర్వకల్లు పోలీస్‌ స్టేషన్‌లో బస్సు డ్రైవర్‌ మద్దిలేటి లొంగిపోయాడు. బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. 

మిన్నంటిన రోదనలు..
ప్రమాద విషయం తెలుసుకున్న మృతుల కుటుంబసభ్యులు, బంధువులు ఘటనాస్థలికి భారీగా చేరుకున్నారు. వైద్యం కోసమని వెళ్లిన తమ వారు.. రక్తమోడుతూ విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. ఇక తమకు పెద్ద దిక్కెవరు అంటూ కన్నీరుమున్నీరయ్యారు. కర్నూలు ప్రభుత్వాస్పత్రి వద్ద కూడా మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. కల్లపరికి చెందిన ఆరుగురు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి. మారెప్ప, లక్ష్మీదేవి, హుసేనమ్మ, సోమక్కలు రక్తసంబంధీకులు. వీరంతా ప్రమాదంలో మృతి చెందడంతో.. వారి కుటుంబసభ్యుల బాధ వర్ణణాతీతం. కాగా, మృతుల కుటుంబసభ్యులను ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య, జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ నేత మురళీకృష్ణ తదితరులు పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement