
సాక్షి, కడప: కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు వైఎస్సార్‌పీపీ ఆధ్వర్యంలో ఉక్కు సంకల్ప దీక్ష చేపట్టారు. విభజన చట్టంలో హామీ ఇచ్చినప్పటికీ కడపలో ఇప్పటికీ ఉక్కు పరిశ్రమ రాకపోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని పార్టీ నేతలు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ సాధించేంత వరకు తమ పోరాటాన్నిఆపబోమని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 23న కడప నగరంలో మహా ధర్నా, 24న బద్వేలు, 25న రాజంపేటలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ దీక్షలో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, కమలాపురం సమన్వయకర్త మల్లికార్జునరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి లతో పాటు జమ్మలమడుగు సమన్వయకర్త డాక్టర్ సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఉక్కు సంకల్ప దీక్ష కొనసాగనుంది.
సీఎం రమేష్‌ది డబ్బు దీక్ష
సీఎం రమేష్ చేసేది డబ్బు దీక్ష అని కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు ఆరోపించారు. వైఎస్సార్ సీపీ చేసేది జనదీక్ష, జనం కోసం చేసే దీక్ష అని పేర్కొన్నారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ రాకుండా అడ్డుకుంది చంద్రబాబే అని మండిపడ్డారు. ఇప్పుడు కపట నాటకాలతో దీక్షలు చేస్తున్నారని విమర్శించారు.