
కాకినాడకు ఏం చేశారు చంద్రబాబు?
కాకినాడ : చంద్రబాబు సర్కార్ మూడున్నరేళ్లలో కాకినాడకు చేసిందేమీ లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. 70 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఏ ప్రభుత్వమూ విడుదల చేయని విధంగా చంద్రబాబు సర్కార్ మూడున్నరేళ్లలో 15వందల రహస్య జీఓలను విడుదల చేసిందని ఆయన ధ్వజమెత్తారు. అయిదేళ్ల పాలనలో నాలుగు లేదా ఐదు జీఓలను కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ప్రభుత్వాలు విడుదల చేస్తాయని అన్నారు. కానీ చంద్రబాబు సర్కార్ 15వందల రహస్య జీఓలు విడుదల చేయడం వెనుక ఆంతర్యమేంటని ధర్మాన నిలదీశారు.
ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ...‘ మున్నిపల్ కార్పొరేషన్‌కు ఎన్నో హామీలు ఇచ్చారు. పోర్టులో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కాకినాడకు వర్సిటీ తీసుకొస్తామన్నారు...ఏమైంది?. ప్రజాస్వామ్య విలువలకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలకు ప్రభుత్వం గౌరవం ఇవ్వడం లేదు. స్పీకర్ వ్యవస్థ అపఖ్యాతి పాలైంది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇప్పటివరకూ చర్యలు లేవు. శివరామకృష్ణ కమిటీ వద్దన్న అంశాలనే అమలు చేశారు. ప్రజా సంఘాలు, మేధావులు, పౌరుల అభిప్రాయాలను తీసుకోలేదు. రాజధాని వ్యవహారం చంద్రబాబు కుటుంబ వ్యవహారమా?. టీడీపీ ప్రభుత్వం ఏడాదిన్నర మాత్రమే ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ అధికారంలోకి రావడం ఖాయం. కాకినాడ వాసుల చిరకాల కోరికలను వైఎస్‌ఆర్ సీపీ నెరవేరుస్తుంది.’ అని హామీ ఇచ్చారు.
టీడీపీని మిత్రపక్షమైన ఎన్డీయే నమ్మడం లేదని, అందుకే చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ధర్మాన అన్నారు. కేంద్రంతో బాబుకు ఉన్న సంబంధాలు చెడిపోయాయన్నారు. కాకినాడ పెద్ద నాయకులు పుట్టిన ప్రాంతమని, ఇక్కడ మేధావులు ఉన్నారని, చంద్రబాబు నైజాన్ని గుర్తించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. చైతన్యవంతమైన కాకినాడ పౌరులు చంద్రబాబు పాలనను వ్యతిరేకించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.