♦ సంక్షేమానికి తూట్లు పొడిస్తే సహించం
♦ సీఎంగా ఉండే అర్హత చంద్రబాబుకు లేదు
♦ ప్లీనరీ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం
ఆమదాలవలస: రాష్ట్ర ప్రజల సొత్తును రాబందుల్లా దోచుకుంటున్న టీడీపీ నాయకులను తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. స్థానిక టీఎస్సార్ విద్యాసంస్థల ఆవరణలో నియోజకవర్గ ప్లీనరీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. తొలుత దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా తమ్మినేని మాట్లాడుతూ మూడేళ్లుగా ప్రజా సంక్షేమాన్ని నిర్వీర్యం చేస్తూ స్వలాభానికి పాటు పడుతున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వెంటనే గద్దె దిగాలని.. ఆయనకు సీఎంగా ఉండే అర్హత లేదని డిమాండ్ చేశారు.
అవినీతికి మారుపేరు కూన
స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ అవినీతికి మారుపేరుగా పేరుపొందారని తమ్మినేని సీతారాం దుయ్యబట్టారు. ప్రస్తుతం ఆయన నియోజకవర్గానికి బ్రాండ్ అని చెప్పుకోడం అపహాస్యంగా ఉందని విమర్శించారు. ఇసుకమాఫియా, ల్యాండ్ మాఫియా ఇలా నియోజకవర్గ ప్రజల సొత్తును వందల కోట్లలో దోచుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెన్నెలవలస గ్రామంలో సర్వే నెం 57లో 32.7 సెంట్లు, సర్వేనెం 50–10లో 40 సెంట్లు ప్రభుత్వ భూమిని తన భార్య ప్రమిళ పేరుమీద ఆక్రమించారని, ఇది రవికుమార్ అవినీతికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. సుగర్ ఫ్యాక్టరీ తీసుకువస్తానని నియోజకవర్గ ప్రజలకు మభ్య పెట్టడం సమంజసం కాదన్నారు.మూత పడిన సుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని ప్లీనరీ తరఫున ప్రభుత్వానికి విన్నవిస్తున్నామన్నారు. ఆనాడు సుగర్ ఫ్యాక్టరీ మూత పడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమనిగురుఉ్తచేశారు. ప్లీనరీ సమావేశానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.
గెలుపే ధ్యేయంగా అహర్నిశలు శ్రమించాలి
పార్టీ గెలుపునకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని సీఎంను చేసేందుకు అహర్నిశలు శ్రమించాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాద్‌రావు పిలుపునిచ్చారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనని.. గత ఎన్నికల్లో ఓటమి గురించి ఆలోచించకుండా వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహరచన చేయాలన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఉన్నారన్నారు. పార్టీలో కొత్తవారిని చేర్చేలా గ్రామ స్థాయిలో బూత్ కమిటీలు శ్రమించాలన్నారు.
‘విప్’ ఇసుక దందా వంద కోట్లు
ప్రభుత్వ విప్ కూన రవికుమార్ చేస్తున్న భూకబ్జాలు, ఇసుక దందాలను ప్రజల్లోకి సాక్షాధారాలతో తీసుకెళ్లాలని పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి నిర్దేశించారు. విప్ ఇసుక దందా వందకోట్లకు పైగా ఉంటుందని గుర్తుచేశారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమత వెంకటరమణ ఇసుక అక్రమరవాణా కోసమే వైఎస్సార్ పార్టీలో గెలిచి టీడీపీలో చేరారని ఆరోపించారు. ఇసుకదందాపై ఆయన ఆదాయం రోజుకు రూ. 40లక్షలని చెప్పారు.
ఆకాంక్షలకు అనుగుణంగా పాలించేవాడే నాయకుడు
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేసేవాడే నిజమైన నాయకుడని రాష్ట్ర రాజకీ య వ్యవహారాల కమిటీ సభ్యులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జగన్‌మోహన్ రెడ్డి అంటే చంద్రబాబుకు భయమని, అందుకే లేనిపోని ఆరోపణలు చేస్తూ జైల్లో ఉంచారని గుర్తుచేశారు. నిజమైన అవినీతి పరుడు చంద్రబాబేనని, తెలంగాణాలో ఓటుకు నోటులో పట్టుపడిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసిందేనన్నారు. జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం తథ్యమని, పార్టీ గెలుపునకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పేరాడ తిలక్, చింతాడ మంజు, దువ్వాడ శ్రీనివాసరావు, వరుదు కల్యాణి, గొర్లె కిరణ్‌కుమార్, రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్‌కుమార్, సువ్వారి గాంధి, గంట్యాడ రమేష్, జిల్లా సేవాదల్ అధ్యక్షుడు ఎ. ఉమామహేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు జె.జె.మోహన్ రావులతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
అవినీతి రాబందులను తరిమి కొడదాం
Published Tue, Jun 6 2017 11:02 PM | Last Updated on Fri, Aug 10 2018 8:26 PM
Advertisement
Advertisement