సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి భవిష్యత్తు...ఆ బంగారు భవిత కోసమే వైఎస్సార్ సీపీ ఆరాటం... దశలవారీగా పోరాటం ... ఆ దిశగా మరో అడుగు వేస్తోంది ... చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న వంచనను జనం ముందు ఉంచేందుకు ...ధర్మపోరాటాల పేరుతో అధర్మానికి పాల్పడుతున్న చంద్రబాబు నైజాన్ని ఎండగట్టేందుకు ఈసారి కాకినాడ బాలాజీ చెరువు కూడలిని వేదికగా చేసుకుంటోంది. హోదా కోసం ఎంపీ పదవులు త్యాగం చేసిన నేతలతోపాటు ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలు, రాష్ట్ర స్థాయి నేతలంతా ఈ సభకు తరలివస్తున్నారు.
హోదాయే ఊపిరిగా...
నాలుగున్నరేళ్లుగా ప్రత్యేక హోదా మరుగున పడకుండా ... మాట తప్పకుండా, మడమ తిప్పకుండా హోదాయే ఊపిరిగా వైఎస్సార్‌సీపీ అవిశ్రాంత పోరు చేస్తోంది. పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా యువభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నాలు, బంద్‌లు, రాస్తారోకో తదితర నిరసన కార్యక్రమాలతో హోదా డిమాండ్‌ను ముందుకు తీసుకెళ్లారు. హోదా కోసం ఎంపీ పదవులను తృణప్రాయంగా వైఎస్సార్‌సీపీ నేతలు త్యాగం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటూ ఆమరణ నిరాహార దీక్షలకు సహితం ఉపక్రమించారు.
కాకినాడ వేదికగా మూడో పోరు...
హోదా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని, ‘ప్రత్యేక హోదా – ఆంధ్రుల హక్కు’ నినాదంతో తొలి నుంచి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నారు. ఈ జిల్లాలోనైతే ఇప్పటికే రెండుసార్లు పర్యటించి హోదా కోసం ఎలుగెత్తి చాటారు. 2016 జనవరి 27న కాకినాడలోని అంబేడ్కర్ భవన్‌లో యువభేరి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే ఏడాది మే పదో తేదీన హోదా కోసం కలెక్టరేట్ ఎదుట దీక్ష చేశారు. తాజాగా వంచనపై గర్జన పేరుతో శుక్రవారం నిరసనకు దిగుతున్నారు. కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, నగర నియోజకవర్గ సమన్వయకర్త ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి హాజరవుతున్న మాజీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, పార్టీ రాష్ట్ర నేతలు, సమన్వయకర్తలతోపాటు వేలాదిగా తరలివచ్చే ప్రజల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment