సమైక్యతీర్మానం కోసం పట్టుపట్టిన వైఎస్ఆర్సిపి
హైదరాబాద్: శాసనసభలో సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలన్న తమ ప్రతిపాదనను ప్రభుత్యం అంగీకరించకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు శాసనసభా వ్యవహారాల కమిటీ(బిఏసి) సమావేశం నుంచి వాకౌట్ చేశారు. బిఏసి సమావేశం నుంచి బయటకు వచ్చిన తరువాత ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విలేకరులతో మాట్లాడారు. సమైక్య తీర్మానం కోసం తాము పట్టుపట్టినట్లు ఆమె తెలిపారు.
సమైక్య తీర్మానం తరువాతే అసెంబ్లీలో చర్చ ప్రక్రియ ప్రారంభం కావాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంతకు ముందు రాష్ట్రాల విభజన సమయంలో ఏ నిబంధనలైతే పాటించారో అవే నిబంధనలు పాటించాలని తాము కోరినట్లు తెలిపారు. సమైక్య తీర్మానానికి అంగీకరించనందున తాము వాకౌట్ చేసినట్లు చెప్పారు. తుపానును అడ్డుకోలేకపోయాను, విభజనను ఆపుతానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రగల్భాలు పలికారని విమర్శించారు.
ముఖ్యమంత్రి కూడా కాస్త విరామం తీసుకుని చర్చిద్దామన్నారని తెలిపారు. అంటే ఆయన ఉద్దేశం కూడా ఇదే విడత సమావేశాల్లో బిల్లుపై చర్చించాలనేనని ఆమె చెప్పారు. తాము మాత్రం సమైక్య తీర్మానం చేసిన తర్వాతనే చర్చల్లో పాల్గొంటామని స్పష్టంచేసినట్లు తెలిపారు. బడ్జెట్ ప్రంసగాలకూ మూడునాలుగు రోజుల సమయం ఉంటుందన్నారు. తీర్మానం చేసేంత వరకూ తాము పోరాడుతామని చెప్పారు. సభను అడ్డుకుంటాం, కార్యకలాపాలను స్తంభింపచేస్తామని విజయమ్మ హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, టిడిపి నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు కూడా (బిఏసి) సమావేశం నుంచి వాకౌట్ చేశారు. సీఎం కూడా సమావేశం నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.