బిఏసి నుంచి వైఎస్ఆర్సిపి వాకౌట్
హైదరాబాద్: శాసనసభలో సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలన్న తమ ప్రతిపాదనకు ప్రభుత్యం వ్యతిరేకత తెలపడంతో శాసనసభా వ్యవహారాలకమిటీ(బిఏసి) సమావేశంను తాము వాకౌట్ చేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు. సమావేశం ముగిసిన తరువాత విజయమ్మ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలన్న తీర్మానం శాసనసభలో ప్రవేశపెట్టాలని తాము డిమాండ్ చేశామని చెప్పారు. తమ డిమాండ్ను ప్రభుత్వం తిరస్కరించడంతో తాము బయటకు వచ్చినట్లు తెలిపారు.
విలేకరులు అడిగి ఒక ప్రశ్నకు తాము సమైక్య తీర్మానం ప్రవేశపెడతామని, ఎవరు మద్దతు తెలిపినా తాము స్వీకరిస్తామని విజయమ్మ చెప్పారు. అన్ని సమస్యలకంటే విభజనే అతిపెద్ద సమస్య అని ఆమె తెలిపారు. తుపాన్ల నష్టాలు, కరెంట్ కష్టాలు, కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు అంశాలపై చర్చకు కూడా డిమాండ్ చేసినట్లు వివరించారు. ప్రజాసమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదని విజయమ్మ తెలిపారు.