
సాక్షి, తాడేపల్లి : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)లు ఒకటి కాదని, రెండూ వేర్వేరని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా స్పష్టం చేశారు. గురువారం తాడేపల్లిలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఏఏ అనేది ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ దేశాల్లోని మైనార్టీలకు పౌరసత్వం ఇచ్చే చట్టమని, ఎన్నార్సీపై కేంద్రం ఇంకా చట్టం చేయలేదని పేర్కొన్నారు. కొంతమంది అవగాహన లేక ఇవి రెండూ ఒకటేనని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నార్సీపై మైనార్టీల్లో నెలకొన్న ఆందోళనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశామని, ఏ ఒక్క ముస్లింకు అన్యాయం జరిగినా జగన్‌మోహన్‌రెడ్డి ఒప్పుకోరని వ్యాఖ్యానించారు. తమను గుండెల్లో పెట్టుకున్న వైఎస్సార్ కుటుంబం మైనార్టీల పక్షపాతి అని వివరించారు. మైనార్టీలకు అన్యాయం జరిగే పని వైఎస్సార్‌సీపీ చేయదని, ఒకవేళ ఎన్నార్సీ వస్తే వైఎస్సార్‌సీపీ వ్యతిరేకిస్తుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నార్సీ చట్టాన్ని అమలుపరిచేందుకు ఒప్పుకోమని స్పష్టం చేశారు. దేశ రక్షణ అవసరాల నేపథ్యంలో సీఏఏకు వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపిందని, ముస్లిం సోదరులు ఈ తేడాను గమనించాలని కోరారు.