మెంటాడ ఎంపీపీ పీఠం
మెంటాడ: కోరం లేక రెండు సార్లు ఎన్నిక వాయిదా పడిన జిల్లాలోని మెంటాడ ఎంపీపీ పీఠాన్ని చివరికి వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. వైస్ ఎంపీపీని టీడీపీ కైవసం చేసుకుంది. మండలంలోని మొత్తం 13 ఎంపీటీసీ స్థానాల్లో 6 స్థానాల్లో వైఎస్సార్ సీపీ, 7 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మెంటాడ ఎంపీపీ పీఠం ఎస్టీకి రిజర్వ్ అయింది. అయితే టీడీపీ నుంచి గెలుపొందిన వారిలో ఎస్టీ ఎంపీటీసీ సభ్యు లు ఒక్కరూ లేరు. 6 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్న వైఎస్సార్‌సీపీకి ఇద్దరు ఎస్టీ ఎంపీటీసీ సభ్యులు ఉండడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎంపీపీ ఎన్నిక సందర్భంగా జక్కువ ఎంపీటీసీ అభ్యర్థి శొంఠ్యాన సింహాచలమమ్మను ఎంపీపీ అభ్యర్థిగా, పోరాం ఎంపీటీసీ అభ్యర్థి చెల్లూరి లక్ష్మణరావు ప్రతిపాదిం చగా,
ఇద్దనవలస ఎంపీటీసీ సభ్యురాలు పూడి రామకృష్ణమ్మ బలపరచడంతో ఎంపీపీగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మధ్యాహ్నం 3.38 గంటలకు ప్రిసైడింగ్ అధికారి శ్రీనివాసరావు ప్రకటించారు. అనంతరం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఏడుగురు ఎంపీటీసీలు ఉన్న టీడీపీ..వైస్‌ఎంపీపీ పదవిని కైవసం చేసుకుంది. వైస్ ఎంపీపీగా చలుమూరి వెంకటరావును పిట్టాడ ఎంపీటీసీ రెడ్డి పార్వతి ప్రతిపాదించగా, కుంటినవలస ఎంపీటీసీ సభ్యురాలు సూరెడ్డి పార్వతి ప్రతిపాదించారు. దీంతో చలుమూరి వెంకటరావు వైస్ ఎంపీపీగా ఎన్నికైట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంత రం ఎంపీపీ, వైస్ ఎంపీపీలకు సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, ప్రిసైడింగ్ అధికారి పి.శ్రీనివాసరావు, ఎంపీడీఓ గంటా వెంకటరావు, పంచాయతీ అధికారి పార్థసారథి, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.
వైఎస్సార్‌సీపీ శేణుల్లో ఉత్సాహం
ఎంపీపీగా శొంఠ్యాన సింహాచలమమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మండలంలోని వైఎస్సార్సీపీ శేణుల్లో రెట్టింపు ఉత్సాహం కనిపించింది. ఆమె ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక స్థానిక కనకదుర్గమ్మ ఆలయంలో వైఎస్సార్సీపీ నాయకులు ఆమెతో పూజలు చేయించారు. అనంతరం సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, వైఎస్సార్సీపీ మండల నాయకులు రెడ్డి సన్యాసినాయుడు, కనిమెరక త్రినాథ, చింత కాశీనాయుడు, జక్కువ పీఏసీఎస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు రెడ్డి అప్పారావు, చెల్లూరు సత్యం, మాజీ ఎంపీపీలు లెంక సన్యాసప్పలనాయుడు, కొర్రాయి కళావతి, సర్పంచ్‌లు యర్రా సింహాచలం, తాడ్డి రామునాయుడు, గజపతినగరం ఏఎంసీ మాజీ చైర్మన్ పొరిపిరెడ్డి అప్పలనాయుడు, ముఖ్య నాయకులు దాట్ల హనుమంతురాజు, కిలపర్తి మధు, బాయి అప్పారావు, సారిక ఈశ్వరరావు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలతో ఆమెను ముంచెత్తి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ సింహాచలమమ్మ మాట్లాడుతూ సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, దాట్ల హనుమంతురాజు, పార్టీ మండల నాయకులు, అభిమానులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉంటూ మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని మండల ప్రజలకు భరోసా ఇచ్చారు.
పోలీసు పహారాలో ఎన్నిక
స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఎంపీపీ, వైస్‌ఎంపీపీ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 144వ సెక్షన్‌ను అమలు చేశారు. బొబ్బిలి డీఎస్పీ ఇషాక్ మహమ్మద్, గజపతినగరం సీఐ చంద్రశేఖర్, ఆండ్ర, పెదమానాపురం, బూర్జవలస ఎస్సైలు పిసిని నారాయణరావు, మహేష్, వై.సింహాచలంలతో పాటు మరో 50 మంది పోలీసు సిబ్బంది ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారు.