
సన్మానగ్రహీతలతో ముత్తంశెట్టి, ఎంవీవీ, వంశీకృష్ణ, కిల్లి కృపారాణి, వరుదు కల్యాణి, గరికిన గౌరి తదితరులు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మహిళాభ్యుయానికి పాటుపడిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని కేంద్ర మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అన్నారు. తన 30ఏళ్ల రాజకీయ చరిత్రలో మహిళల ప్రగతి కోసం అంతగా శ్రమించిన నాయకుడిని మరొకరిని చూడలేదని అన్నారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవంసందర్భంగా మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయిందని మహిళలపై అత్యాచారాలు, దాడులు, హత్యల్లో రాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలో ఉందంటే అది చంద్రబాబు ఘనతేనన్నారు. మహిళలను కేవలం ఓటు బ్యాంక్‌గా వాడుకుంటున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలన్నారు. రామరాజ్యం జగన్‌మోహన్‌రెడ్డితో సాధ్యమన్నారు.
మహిళలే శక్తిమంతులు
అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ పురుషులకు దీటుగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ఇప్పటివరకు ఎందరో మహోన్నత వ్యక్తులు దేశ ప్రధానులుగా చేసినా శక్తివంతమైన ప్రధాని అంటే ఇందిరాగాంధీనే అన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో ఉన్న 81 వార్డులను 100 వార్డులుగా చేస్తామని, అందులో 50 శాతం మహిళలకే ఇస్తామని జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. విశాఖ పార్లమెంట్ సమన్వయకర్త ఎంవీవీ మాట్లాడుతూ ఎన్ని కుయుక్తులు పన్నినా వైఎస్సార్‌సీపీ విజయభేరీని అడ్డుకోలేరన్నారు.
జగన్‌తోనే మహిళాభ్యుదయం
అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త వరుదు కళ్యాణి మాట్లాడుతూ వైఎస్సార్ ప్రతి సంక్షేమ పథకంలో మహిళలకే పెద్దపీట వేశారని, మళ్లీ అటువంటి నాయకుడు జగనన్నే అన్నారు. నగర అధ్యక్షురాలు గరికిన గౌరి మాట్లాడుతూ టీడీపీ పాలనలో మహిళలకు భద్రత లేదన్నారు. గత ఎన్నికల్లో మహిళలను మోసం చేసిన చంద్రబాబుని గద్దె దించుదామని, మహిళలు అందరం కలసి జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుందామని అన్నారు.
వివిధ రంగాల్లో మహిళలకు సన్మానం
వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన మహిళలను పార్టీ నాయకులు సత్కరించారు. ప్రముఖ న్యాయవాది అరుణకుమారి, నృత్యకారిణి లిపికారెడ్డి, సీనియర్ ఉపాధ్యాయిని ఉషారాణి, సాక్షి దినపత్రిక సబ్‌ఎడిటర్ రాజేశ్వరిలను శాలువాలతో సన్మానించారు.కార్యక్రమంలో విశాఖ తూర్పు సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి, అదనపు కార్యదర్శులు దివాకర్ పక్కి, రవిరెడ్డి, నగర యువజన విభాగం అధ్యక్షుడు రాజీవ్, యువజన విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్ నియోజకవర్గ మహిళా ఇన్‌చార్జిలు సాది పద్మారెడ్డి, మళ్ల ధనలత, కృప, పల్లా చినతల్లి, సబీరా బేగం, జీవీ రమణి, శ్రీదేవివర్మ అధిక సంఖ్యలో వార్డు అధ్యక్షులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment